Search This Blog

Monday, July 2, 2012

పేరులో ఏముంది?

పార్టీ ఆఫీసు నిండా జనం. కానీ సందడి లేదు. తలలు వేలాడేసుకుని చిన్నచిన్న గుంపులలో గుసగుసలాదుతున్న పార్టీ నాయకులనీ, కార్యకర్తలనీ చూడగానే అప్పలనాయుడి గుండె జారిపోయింది.
ఇక లాభం లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పటికే వెలువడింది. నాయకుడు శంకర్ బయటకి రావడానికి ఇదే ఆఖరి ప్రయత్నం. ఈ సుప్రీంకోర్టు బెంచీ గనుక అతడి విడుదలకి అంగీకరించకపోతే... ఇప్పుడిప్పుడే వేళ్ళూనుతున్న పార్టీకి గొడ్డలిపెట్టే! నాయకుడు లేని పార్టీ తలలేని కాయంలాంటిదే. అక్రమార్జన కేసులో నేరం నిరూపించబడింది. ఆపై వేసిన అపీలు హైకోర్టు తిరస్కరించింది. శిక్షాకాలం పదేళ్ళు ఖరారయింది. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు కూడా అదేపని చేస్తే, ఇంకో పదేళ్ళవరకూ తమ నాయకుడు బయటికి వచ్చే ఆస్కారంలేదు. అంటే మరో పదేళ్ళవరకూ అతడు ముఖ్యమంత్రి పదవి చేబట్టే ప్రశక్తేలేదు. అంతేకాదు, ఎలెక్షన్ కమిషన్ నియమాల ప్రకారం, ఎన్నికల బరిలో దిగేందుకు ఎటువంటి వీలూలేదు.
పార్టీ ఆవిర్భావంనుంచీ వెంటనిలిచి, నియోజకవర్గంలో ఒక పట్టు సంపాదించాడు, అప్పలనాయుడు. టెలివిజన్ ఛానెల్స్ నిర్వహించిన సర్వేలు పార్టీకి రెండువందల పైచిలుకు సీట్లు రావచ్చని చెబుతున్నాయి. తమ నాయకుడే కనుక వెంట ఉంటే తన గెలుపు ఖరారే. శంకర్ అంటే ప్రజలలో విపరీతమైన ఆదరణ ఉంది. కానీ ఏంలాభం ... అతడే బరిలో లేకపోతే వోట్లు పడేటట్లా? పదిశాతం వోట్లు తగ్గినా, ఫలితాలు తలక్రిందులవుతాయ్. నియోజకవర్గపు కార్యకర్తలలో కూడా అదే బెదురు. శంకరన్నని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష అయితే ప్రజలలో ఉంది. కానీ అది సాధ్యంకాదని రూఢీ అయ్యాక, వేరే ప్రత్యమ్న్యాయం కోసం ఆలోచిస్తారేతప్ప పార్టీకి వోటేస్తారా?
ఇలా కొనసాగుతున్న ఆలోచనలలోంచి బయటపడుతూ, భుజంపైన చరిచినదెవరా ప్రక్కకి తిరిగి చూసాడు. "ఏం నాయుడుగారూ, ఏమన్నా ఖబర్ వచ్చిందా?" పైకి నవ్వుతూ పలకరించినా మస్తాన్భాయ్ ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మస్తాన్ గుంటూరుజిల్లా వాడు. టౌనులో మంచి పలుకుబడి ఉంది. గుంటూరు వన్ నియోజకవర్గానికి టికెట్టు దాదాపు అతనికే రావచ్చు.
"ఏమో? నేనూ ఇప్పుడే వస్తున్నాను. ఇవాళ ఉదయమే తెలిసింది. పలాసలో రైలెక్కి వైజాగు వచ్చి అక్కడనించి ఫ్లైటులో వచ్చాను."
"నేనూ అంతే. ప్రొద్దున్నే కార్లో బయల్దేరాను. దేనికో ఈ సమన్లు అంతుబట్టట్లే".
"బీ-ఫారమ్లకోసమే అయితే ఇంత హడావుడి అవసరం లేదు. చిన్నమ్మ ఏదో కొత్త ప్లాను ప్రకటిస్తారని క్రిష్ణారెడ్డి చెప్పాడు. పదండి లోపలికెళితే తెలుస్తుంది."
---
హాల్లో పెద్ద ప్లాస్మా టీవీ. అందరి దృష్ఠీ దానిమీదే. అది శంకరన్న స్వంత ఛానెల్. ఢిల్లీ నుండి నిమిషనిమిషానికీ అదే వార్త. అందరిలో ఒకటే ఉత్కంఠ. సుప్రీంకోర్టులో మూడురోజులుగా జరిగిన వాదనలు పూర్తయ్యాయి. ఇక అప్పీలు స్వీకరించేదీ లేనిదీ ఏ క్షణాన్నయినా ప్రకటించవచ్చు.
"నిన్నటిదాకా పరిస్థితి ఆశాజనకంగానే ఉండె. రాత్రికి రాత్రి ఏమయినాదో? లాయర్ మలానీ సిన్నమ్మని కలిసిండంట", గుసగుసలాడాడు క్రిష్ణారెడ్డి. క్రిష్ణారెడ్డి పార్టీలో సీనియర్ నేత. అప్పలనాయుడికి గురుతుల్యుడు.
"అంటే పరిస్థితి తారుమారైనట్లే కదా? జనంలో సానుభూతి ఉన్నమాట నిజమేగానీ, శంకరన్నే లేకపోతే..." తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు అప్పలనాయుడు.
"ఏమీ భయంలేదప్పా. శంకర్ బాబు లేకుంటేనేం సిన్నమ్మ ఉండాదిగా"
"మీ సంగతి సరేనన్నా, మీ ప్రాంతంలో కాస్త మార్జిన్లు తగ్గినా గెలుపు గ్యారెంటీ. మా ఏరియాలో అన్నిచోట్లా త్రికోణపు పోటీలు. కాస్త అటూఇటూ అయినా..."
"అవును భాయ్. శంకర్ భాయ్ సీయెం అయేందుకు వీలుకాదంటే, కార్యకర్తలలో ఇప్పటికే నిరుత్సాహం కనపడ్తుంది. అది చాలు మనని దెబ్బకొట్టేందుకు", నసిగాడు మస్తాన్, తన గడ్డం సవరించుకుంటూ.
నిజమే! ఇటు అభ్యర్థులలో, అటు కార్యకర్తలలో ఎటు చూసినా నిరుత్సాహమే! అందునా ఈ సమయంలో... ఏంచేయాలో తోచక తలవిదిలిస్తూ వెనుదిరిగాడు, క్రిష్ణారెడ్డి.
"ఆహ్! క్రిష్ణారెడ్డీసాబ్, ఆప్ కేలియేహీ డూంఢ్ రహా హూ. ఒకసారి లోనికి వస్తారా?" అంటూ ఎదురొచ్చాడు, దేబాషిష్ పట్నాయక్.
---
దేబాషిష్ ఒక ప్రముఖ మార్కెట్ రిసెర్చి ఏజెన్సీలో మానేజరు. శంకర్ పార్టీకి సంబంధించిన సర్వేలూ, ఒపీనియన్ పోల్స్ ఆ సంస్థే నిర్వహిస్తుంది. ఎన్నికలముందు నియోజకవర్గాలలో, బూత్వారీగా పార్టీ అభ్యర్దుల బలాబలాలు బేరీజువేసుకునే కార్యంలో నిమగ్నమై ఉంది.
‘నో ఎంట్రీ - ప్రవేశంలేదు’ అని రెండుభాషలలో నోటీసులు అంటించి ఉన్న తలుపు  తోసుకొని లోనికి ప్రవేశించారిద్దరూ. కంప్యూటర్లూ, ప్రొజెక్టర్లూ, కాళీ అయిన కాఫీ కప్పులూ, సిగరెట్లతో నిండిపోయిన యాష్ట్రేలూ ... పెద్ద రౌండ్ టేబుల్ మీద అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. స్క్రీనువంక చూస్తూ ఒకరితోఒకరు వాగ్యుద్ధం చేస్తున్నవాళ్ళు, కంప్యూటర్లలో తలలు ముంచి తమపని తాము చేసుకుంటున్నవాళ్ళు, సోఫాలలో కాళ్ళుజాపుకుని కునికిపాట్లు పడుతున్న వాళ్ళు, తమలో తామే దీర్ఘంగా ఆలోచిస్తూ, అంతే దీర్ఘంగా పొగపీల్చి వదిలేవాళ్ళు - ఆడామగా అందరూ కలిసి పాతికమంది ఉండవచ్చు - లూజుగా వేళ్ళాడే టైలూ, మోచేతులదాకా మడిచిన షర్ట్ స్లీవులూ, గంజిపెట్టి ఇస్త్రీచేసిన ఖద్దరు చొక్కాలూ, జీన్సు ప్యాంట్లపై వెలిసిన టీషర్టులూ; ఇంగ్లీషూ, హిందీ, తెలుగూ - అన్ని భాషలూ కలిసిన రణగొణధ్వని.
"హలో క్రిష్ణారెడ్డీ సాబ్, వీయార్ వెయిటింగ్ ఫర్ యూ. ఇందాకే శంకర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. ఒక పది నియోజకవర్గాలకి తప్ప అన్నింటికీ అభ్యర్ధులని ఖరారుచేసి, స్వహస్తాలతో వ్రాసి ఫ్యాక్సు చేసాడు. వీ నీడ్ యువర్ హెల్ప్", అని ఇంగ్లీషులో అంటూ, చేతిలోని తెల్లకాయితాల దొంతరతో ఎదురొచ్చాడు పిళ్ళే. అతడు రిటైర్డు డీజీపీ. పార్టీలోనూ బయటా శంకర్కి భీష్మాచార్యుడిలాంటి వాడు.
"వెరీగుడ్ సార్. ఏంచేయాలో చెప్పండి", ఎంత కప్పిబుచ్చుకోవాలన్నా, ఆ లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో తెలుసుకోవాలన్న ఆతృత క్రిష్ణారెడ్డి గొంతులో ధ్వనించింది.
"అమ్మాయ్ ఫోన్ చేసింది. ఢిల్లీలో పని పూర్తికాగానే బయలుదేరి అర్థరాత్రికల్లా వచ్చేస్తుంది. ఈలోగా..." అంటూ ఆగి ఒకసారి అటూఇటూ పరికించి, "మీతో ఒక పని ఉంది. పదండి అలా టెరేస్ మీదకెళ్ళి మాట్లాడుకుందాం", అంటూ వెనుక డోర్ వైపు దారితీసాడు.
---
"తెలుగువీరలేవరా...." అప్పలనాయుడి సెల్ ఫోన్ మోగసాగింది. చూస్తే క్రిష్ణారెడ్డి నుండి ఫోన్.
"హల్లో సార్"
"జాగ్రత్తగా వినప్పా, నాయుడూ ..."
రాత్రి పదింటికి తాజ్ హోటల్లో మీటింగు. చిన్నమ్మ ఢిల్లీనుండి వచ్చి అందరితో మాట్లాడుతుందట. అందరూ అంటే ఎవరు? అభ్యర్దుల లిస్టు ఖరారయిందా? ఎందుకింత రహస్యం? అంతవరకూ పార్టీ ఆఫీసు కూడా వదిలిపెట్టి, ఎవరినీ కలవకూడదూ, సంప్రదించకూడదని ఆదేశం! ఆలోచనలతో తలమునకలౌతూ, వెంట బయల్దేరిన కార్యకర్తలకి, అర్జెంటు పని ఉందని  చెప్పి వారించి, "పంజగుట్టకి పోనీయి" అంటూ కార్లో కూర్చున్నాడు. తన డ్రైవరూ, గన్ మ్యాన్ తప్ప ఇంకెవరూ లేరు.
టైముచూస్తే నాలుగున్నర. కనీసం నాలుగు గంటలు... ఒంటరిగా ఏంచేయాలి?
షాపింగ్?
ఎన్నాళ్ళయిందో? ఒంటరిగా షాపింగుకి వెళ్ళి. ఈ రాజకీయాల్లో చేరకముందు, ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఇంట్లో అందరికీ ఏదో ఒకటి కొనకుండా తిరిగివెళ్ళేవాడు కాదు. ఆ మహానాయకుడి పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పోయాక రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు. శంకరన్న స్థాపించిన పార్టీలో ఎన్నో వడుదుడుకులూ, అభియోగాలూ ఎదుర్కుంటూ ఈ నాలుగేళ్ళూ అతని ప్రక్కనే నిలిచాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపి ఎన్నాళ్ళయిందో! తన కూతురు ఇక్కడే హైదరాబాదులోనే హాస్టల్లో ఉండి మెడిసిన్ చదువుతుంది. ఇన్నిసార్లు హైదరాబాదు వచ్చినా దానిని కలిసిందేలేదు. ఫోన్ అందుకుని, డయల్ చేసాడు.
"హల్లో డ్యాడీ!" గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది.
"ఏమ్మా బేబీ ఎలా ఉన్నావ్? పనిమీద వచ్చాను. ఒకటి రెండు గంటలు ఖాళీ దొరికింది. అలా వద్దామని అనుకుంటున్నాను."
"సారీ డ్యాడీ, నేనిప్పుడు హాస్టల్లో లేను. ఫ్రెండ్స్తో సిటీకి వచ్చాను"
"ఎక్కడున్నావ్?"
"పంజగుట్ట... సెంట్రల్"
"వెరీగుడ్. నీకూ నీ ఫ్రెండ్సుకీ అభ్యంతరం లేకపోతే అక్కడే కలుద్దాం. సరేనా?"
"గ్రేట్ డ్యాడీ... మేము ఇక్కడే మ్యక్డోనాల్డ్స్లో వెయిట్ చేస్తాం"
"ఓకే... పదిహేను నిమిషాల్లో అక్కడ ఉంటాను" అని ఫోన్ ప్రక్కనపెట్టి డ్రైవరుతో "హైదరాబాద్ సెంట్రల్ మాల్" అంటూ, సిగరెట్టు వెలిగించి, కార్ అద్దం కొంచెం దింపి బయటకి చూడసాగాడు. సిటీ ఎంత మారిపోయింది? ఇన్నేళ్ళగా వస్తున్నా ఎంతసేపూ పార్టీ ఆఫీసూ, హోటలూ, సెక్రటేరియట్టూ, శంకరన్న బంగళా తప్ప బయటకి వెళ్ళేదే తక్కువ అనుకుంటూ పొగవదలసాగాడు.
బేబీతో పాటూ ఇద్దరు ఫ్రెండ్స్. కాసేపు షాపింగంటూ మాల్ అంతా చుట్టి, మ్యక్డోనాల్డ్ బర్గర్లు తినడంతో సాయంకాలం ఆరయ్యింది. ఇంకా మూడు గంటలు. కూతురి సలహామీద పీవీఆర్ మల్టీప్లెక్సులో టికెట్లు కొనుక్కొని లోనికి వెళ్ళి కూర్చున్నాడు. ఏదో హిందీ సినిమా. సినిమా చూస్తున్నాడనే కానీ, ఆలోచనలన్నీ ఎన్నికలమీదే. సుప్రీంకోర్టు నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. బేబీ ఫోన్లో ఆన్-లైన్లో చూసింది. హాల్లో ముళ్ళమీద కూర్చున్నట్లుంది. ఫోన్ సైలెంట్ మోడులో ఉంది... పాతికకి పైగా మిస్సుడ్ కాల్స్. ఎవరితోనూ మాట్లాడవద్దని కదా ఆదేశం.
ఇంటర్వెల్లో, కాలక్షేపం బఠానీలు అన్నట్లు, పాప్ కార్న్ క్యూలో నిలుచున్నాడు.
"ఎదురుగా ఇంకో ఖద్దరు చొక్కా.... "ఏంభాయ్ సినిమాకి వచ్చారా?" అడిగాడు మస్తాన్.
"ఆహ్ ఆహ్... మా బేబీ అడిగితే ఇలా తీసుకొచ్చాను" తడబడ్డాడు, అప్పలనాయుడు.
"మంచిపని చేసారు. పదింటికి కదా మీటింగు. అంతవరకూ టైంపాస్. మా బేగంతో సినిమాకెళ్ళి కూడా చాలారోజులైంది. ఇంతకీ ఏ సినిమాకి?"
"ఏదో సినిమా. ఇప్పుడు సినిమా చూసే మూడ్ కూడానా... అయినా మీటింగు ఎందుకో? అందులోనూ ఇంత రహస్యంగా...? ఎవరితో మాట్లాడవద్దని క్రిష్ణారెడ్డిగారు గట్టిగా చెప్పారు. మీక్కూడా ఫోన్ వచ్చిందా?" మస్తాన్ మీటింగ్ విషయం ప్రస్తావించడంతో అతని మనస్సులో ఉన్న అనుమానాలన్నీ ఒక్కసారిగా బయటపెట్టాడు, అప్పలనాయుడు.
"ఆల్మోస్టు అన్ని సీట్లూ నిర్ణయించినట్లే. ఫోను వచ్చిందంటే టికెట్టు ఖాయమే అనుకోండి నాయుడూ."
"ఏం టికెట్టో మస్తాన్ భాయ్. దానికి రెండువైపులా పదునే. శంకరన్న లేకుండా బరిలో దిగితే జనం వోటేస్తారో లేదో? ఇందాక పార్టీ ఆఫీసులో అందరూ అదే టాపిక్. శంకరన్న ముఖ్యమంత్రి అనికదా ఇప్పటిదాకా మన క్యాంపెయిన్. ఇప్పుడు అది సాధ్యం కాదంటే... ఏంచేస్తారో...?" అంటూ నాన్చాడు.
"నిజమే నాయుడుగారూ, సర్వే రిపోర్టులో కూడా కోస్తాలో పాతిక శాతం వోట్లు తగ్గే అవకాశం ఉందట."
"అంటే... మన ప్రొజెక్షన్లు అన్నీ తలక్రిందులే" ఇలా చర్చించుకుంటూ, సినిమా మళ్ళీ మొదలైన విషయమే మర్చిపోయారిద్దరూ. సినిమా పూర్తయి బయటకి వచ్చిన కుటుంబసభ్యులని వాళ్ళ దారిన పంపించి ఇద్దరూ ఒకే కార్లో తాజ్ హోటల్ చేరారు.
హోటల్ లాబీలో బయటా విపరీతమైన జనం. మీడియా కెమేరాలు. ఎలా వాసనపట్టారో?
"మీకు టికెట్టు ఇచ్చారా?" ప్రశ్నిస్తున్న టీవీ రిపోర్టర్.
"నో కామెంట్స్" అంటూ వాళ్ళని తోసుకుని ముందుకి వెళ్ళారిద్దరూ.
వాళ్ళ వెంట కెమేరాతో పరుగెడుతూ, న్యూస్ యాంకర్ని ఉద్దేశ్యించి, "తెక్కలి నియోజకవర్గం అప్పలనాయుడూ, గుంటూరు టౌన్ షేక్ మస్తాన్ వలీ ఇప్పుడే హోటల్లోకి ప్రవేశిస్తున్నారు సుష్మా, అంటే వీళ్ళిద్దరికి టికెట్టు ఖాయమయినట్లే. గుంటూరులో ముస్లీం అభ్యర్ధిని నిలబెట్టడంవల్ల అక్కడి ఇరవై శాతం ముస్లీం వోట్లమీద పార్టీ వలపన్నినట్లే భావించాలి. ఇక అప్పలనాయుడు, శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన సామజికవర్గానికి చెందినవాడు. మొదటినుండీ పార్టీలో ముందుండి నడిపించినవాడు. అయితే... జిల్లాలో అంతమంది సీనియర్ నాయకులతో ఢీకొనే సత్తా ఈ యువనాయకునిలో ఉందా, అన్నదే ప్రశ్న. కెమేరామన్ మణితో రిపోర్టర్ ...."
మీటింగు క్రిస్టల్ హాల్లో. ప్రవేశించేముందు పకడ్బందీగా సెక్యూరిటీ. ఏదో బొంబాయి ఏజెన్సీ... "నో సెల్ఫోన్స్. నో బ్యాగ్స్... అన్నీ ఇక్కడే పెట్టి, లిస్టులో ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళాలి"
---
అభ్యర్ధుల్లో ఎక్కువ శాతం యువకులే. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న. శంకరన్న లేకుండా ఎన్నికలు... ఎలా? నల్లేరు మీద బండి నడక అనుకున్న పార్టీ పరిస్థితి ఇప్పుడు తారుమారు అయ్యేట్లుంది.
చిన్నమ్మ ఢిల్లీలో బయల్దేరి రెండుగంటలైందట. ఏ క్షణంలోనైనా వచ్చేస్తుంది. శంకరన్న లేకుంటే ఇక పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? చిన్నమ్మా? ఆమెకి రాజకీయ అనుభవం ఏదీ? ఇంత స్వల్ప సమయంలో ఆమెని ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం స్వీకరిస్తారా?
"డోంట్ వర్రీ బ్రదర్. మేడం వచ్చాక మీకే తెలుస్తుంది. ఫెంటాస్టిక్ ప్లాన్" చిరునవ్వుతో పలకరించాడు, పదిమంది లాయర్ల మధ్య కూర్చొని ఏవో పేపర్లు తిరగేస్తూ వాళ్ళతో చర్చిస్తున్న దేబాషిష్ పట్నాయక్.
"ఏమో దేబూభాయ్, సుప్రీంకోర్ట్ నిర్ణయం తరువాత శంకర్జీ ఎన్నికలలో ఎలా పోటీ చేయడం?" బల్లపైన ఉన్న పేపర్ల వంక పరీక్షగా చూస్తూ, ఒరియాలో  అడిగాడు, అప్పలనాయుడు.
"చూస్తూ ఉండండి. ఒక నియోజక వర్గం ఏమిటి. అన్ని నియోజకవర్గాల్లో శంకర్ భాయ్ కాంటెస్ట్ చేస్తాడు" అని అర్థవంతంగా నవ్వాడు దేబాషిష్.
---
చిన్నమ్మ ప్రసంగం పూర్తయింది.
ఇంకా ఎవరూ షాక్ నుండి  తేరుకోలేదు. నిద్రలో నడిచినట్లు బయటకి అడుగులేసారు. వరుసగా టేబుల్స్, జిల్లాలవారీగా. ప్రతి టేబుల్కీ, ఒక నోటరీ. ప్రతి అభ్యర్థి పేరునా అఫిడవిట్లు రెడీగా ఉన్నాయి.
"రేపు ఉదయం పేపర్లో ప్రకటన వచ్చిన వేంటనే పని పూర్తయినట్లే. బీ ఫారంతో బాటూ, ఈ అఫిడవిట్ కాపీ, పేపర్ ప్రకటన కాపీ, జతచేస్తే చాలు. నామినేషన్ వేయడానికి..."
"ఎల్లుండి మంచిరోజు. మద్యాహ్నం పన్నెండూ ఇరవైకి ఒకేసారి రెండు వందల తొంభై శంకరన్నల నామినేషన్..."
"ప్రతి నియోజకవర్గం నుండీ శంకరన్నే పోటీ... ప్రత్యర్థులకి తలతిరిగిపోతుంది, అహహా"
"రేపు పేపర్లో ప్రత్యేకంగా ఐదు పేజీలలో అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని సంఘటన కాబోతుంది. ఇక పార్టీ గెలుపు గ్యారెంటీ..."
"రాష్ట్రంలో ప్రతి బ్యాలెట్ మిషన్ మీదా శంకరన్న పేరు!"
"ఒక శంకరన్నని ఆపితే, వందలకొలదీ శంకరన్నలు. వాట్ యాన్ ఐడియా, మేడం!" చిన్నమ్మ చుట్టూ మూగి ప్రశంసలతో ముంచెత్తారు సంతకాలు చేయడం పూర్తిచేసిన పార్టీ అభ్యర్థులు.
బ్ల్యాక్ ఇంక్ పెన్ను తీసుకొని ఎదురుగా ఉన్న స్టాంపు పేపర్ వంక చూసాడు, అప్పలనాయుడు.
‘బొబ్బిలి అప్పలనాయుడు, s/o అచ్చన్న నాయుడు అనే నేను ఈ దినం నుండీ నా పేరును శంకర్ బీ. ఏ. నాయుడుగా మార్చుకొనడమైనది’ అని దాని సారాంశం.
---


No comments:

Post a Comment