Search This Blog

Sunday, June 24, 2012

మేడం - ఒక చిన్న కథ


మేడం నుంచి అర్జెంటుగా రమ్మని కబురొచ్చింది, ఏం ముంచుకొచ్చిందో? గబగబా లేసి ఛేంబర్లోని అద్దంలో ఒకసారి ముఖంచూసుకొని బయటకి అడుగులేసాడు గణేష్. డీసీపీ అడ్మినిస్ట్రేషన్, ఈ మిల్లెన్నియంలో ఫస్ట్ బ్యాచ్ ఐపీయెస్ ఆఫీసర్. పన్నెండేళ్ళ సర్వీసులో ఐదుసార్లు పోలీస్ మెడల్ సాధించిన యువ ఆఫీసర్. పోలీసోడంటే ఇలా ఉండాలి అని జనాల్లో పేరు సంపాదించాడు. ఇక మీడియా ఐతే సరేసరి, ఏదో ఒక విషయంలో అతడిని ఇంటర్వ్యూ చేయకపోతే టెలివిజన్ ఛానల్సుకి వారం గడవదు.
సెక్రెటేరియట్ చేరేసరికే బయట ఇరవైకి పైగా లాల్ బత్తీ కార్లు. ఇంకా మేడం కాన్వాయ్ ఐతే రాలేదు. హమ్మయ్య అనుకుంటూ తన స్కార్పియోలోంచి దిగి హడావుడిగా లోనికి పరిగెత్తాడు. "అర్జెంటుగా క్యాబినెట్ మీటింగటయ్యా, ఎందుకో తెలీదు. నిన్ను మాత్రం ఛేంబర్లో వెయిట్ చేయమన్నారు", అని పైకి అంటున్నా, నాకు తెలీకుండా ఈ ఆఫీసులో ఏదీ జరగదు అన్నట్లు అర్థవంతంగా చిరునవ్వు నవ్వుతూ బయటే ఎదురొచ్చాడు, నరసింహారావు. సీయెంలు ఎంతమంది మారినా అతడిని మాత్రం గత ఇరవై యేళ్ళగా సీయెం పేషీనుంచి ఎవరూ కదిలించలేదు. పేరుకి సీయేడీలో అస్సిస్టెంట్ సెక్రటరీయే కానీ, స్టేట్లో అతడు తెలియని ఆఫీసరే లేడు. ఇంకా నాలుగేళ్ళలో రిటైరవుతాడనగా ఐయ్యేయస్ కన్ఫర్ అయింది.
"ప్చ్... ఏమోసార్. నాకూ తెలీదు. ఇందాకే బంగళానుంచి ఫోను వచ్చింది, ఉన్నపళాన సెక్రటేరియట్కి రమ్మని... అంతే"
"ఏమోనయ్యా... ఇంతమంది సీయెంలని చూసానుకానీ, ఈ పిల్ల ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలీదు. వాళ్ళ నాయన నోట్లోంచి ఊడిపడింది", అని గుసగుసలాడుతూ, లోనికి దారితీసాడు, నరసింహారావ్.
"అంతేమరి... గతంలో ఏ ప్రభుత్వానికీ రాని మెజారిటీ. అపోజిషన్ అసలేలేదు, ఇక పార్టీలో ఆమె ఎదుట గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీలేదు ... చూద్దాం ఏంచేస్తుందో"
"కరెక్టుగా చెప్పావ్. ఎవరి మాటా ఎలాగూ వినదు, మనం మాత్రం చేసేదేముంది?"
"ఇంతకీ నేను కాకుండా ఇంకెవరెవరున్నారో... మీటింగులో?"
"ఎవరు లేరూ! అందరూనూ... ఫుల్ క్యాబినెట్, అన్ని డిపార్టుమెంట్ల పీయెస్లూ, సీయెస్, మీ డీజీపీ .... అందరూ వచ్చారు. నిన్ను మాత్రం సపరేటుగా ఛేంబర్లో ఉంచమని మేడం ఇంస్ట్రక్షన్స్. అందుకే బయట నీకోసం వెయిట్ చేస్తున్నా. కాన్వాయ్ పది నిమిషాల క్రిందటే బయల్దేరింది. ఏ క్షణాన్నయినా రావచ్చు", అని గణేషుకి సీటు చూపించి గదిలోంచి నిష్క్రమించాడు, నరసింహారావ్.
---
ఎడమచేయి నిటారుగా పైకెత్తి మణికట్టు వద్దనుండి చెయ్యి ఊపుతూ లోనికి ప్రవేశించిన మేడం, అదే చేతితో అందరినీ కూర్చోమని సైగచేస్తూ తన కుర్చీ వైపు నడిచింది. ముందుగా హాలులో తన సీటు వెనుక గోడపై అమర్చిన తన తండ్రి నిలువెత్తు పటానికి నమస్కరించి, వెనుకనే అనుసరించి వచ్చిన గణేష్ని ప్రక్కనే నిలువమని సంజ్ఞచేసి ఆసీనులైన ప్రముఖులని ఉద్దేశ్యించి...
"మీకందరికీ తెలుసు, ఏడుకోట్ల ప్రజల ఆశీస్సులతో ఈ ప్రభుత్వం బాధ్యతలు చేబట్టి ఇవాళ్టికి సరిగ్గా నూరు రోజులయింది. ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటికి కృషి చేసేందుకు మేము వేసే ప్రతి అడుగుకీ అంతరాయమే. మా నాయన ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ, గత ప్రభుత్వపు నిర్లక్ష్యం వల్ల అవినీతీ బంధుప్రీతీ పెరిగిపోయినాయ్. మీ రాజకీయ నాయకులకూ, ప్రభుత్వోద్యోగులకూ ప్రజోపయోగం మరిచిపోయి స్వంతలాభాలకు పనిచేయడం అలవాటైపోయింది. దానికి ఒకరిని అని లాభంలేదు. ఇది వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళు. ఇది ఎంతలోతుగా చ్రొచ్చుకు పోయిందంటే, న్యాయవ్యవస్థ, సీబీఐలు కూడా దీనికి అతీతం కాదని గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన సంఘటనలే ఉదాహరణ."
వింటున్నాడనేగానీ, గణేష్ చెవుల్లో ఇంకా ఛేంబర్లో మేడం చెప్పిన మాటలే రింగుమంటున్నాయి. ‘అది సాధ్యమా? ఇన్నాళ్ళుగా ఎవరూ చేయలేనిపని! తానొక్కడివల్ల సాధ్యమా? మేడం ఉద్దేశ్యం మంచిదే ... కానీ...’  అలా, అవిధంగా సాగుతున్న ఆలోచనల్లోంచి, తన పేరు వినపడగానే వాస్తవానికి వచ్చాడు.  
"ఈ అవినీతికి ఫులిస్టాప్ పెట్టాలంటే, అన్నింటికంటే పెద్ద అడ్డంకి ... ‘అయ్యో మనవాడే, పాపం వదిలేయండి’ అని వెన్నుకాసే పెద్దలే. ముందు ఈ వ్యవస్థలోని నెపోటిజమ్ అనే వేరుపురుగుని నాశనంచేస్తే కానీ, ఈ అవినీతి అనే వ్యాధినుంచి వ్యవస్థను ప్రక్షాళణ చేయలేము. రాష్ట్రాన్ని ప్రగతివైపు నడిపించాలనే ఆ మహానాయకుని ఆకాంక్షని పూర్తి చేయలేం. అందుకని, ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చే మిమ్మల్నందరినీ ఇక్కడికి పిలిపించాను. ఈ కార్యానికి సారథ్యం వహించడానికి, ఒక మచ్చలేని అధికారి అవసరం ఉంది. అందుకే, ఎన్నో సర్వీస్ రికార్డులని శోధించిన తరువాత, యువకుడూ, ఈ కార్యభారాన్ని నిర్వహించడానికి అన్ని అర్హతలూ కలిగిన పోలీస్ అధికారిని ఎంపికచేయడం జరిగింది. ఇప్పుడు శ్రీ గణేష్ ఐపీయెస్, ఆ పథకాన్ని క్లుప్తంగా వివరిస్తారు", అని అతడి వైపు తిరిగి చిరునవ్వు నవ్వింది మేడం.
పథకమా? అని ఒక క్షణం నెవ్వెరపోయిన మాట వాస్తవమే. ఛేంబర్లో మేడం చెప్పిన విషయాలని కార్యరూపంలో పెట్టాలంటే కనీసం ఆరునెలలు పట్టవచ్చు. ముందుగా ఒక బ్లూప్రింటు తయారుచేయడానికే కొన్ని వారాలు పట్టవచ్చు. మేడం ఉద్దేశ్యం తెలిపి ఇంకా అరగంట కూడా కాలేదు, ఇంతలోనే ఇంతమంది పెద్దలకు, పథకాన్ని వివరించాలా? ఎలా? కర్చీఫుతో ముఖం తుడుచుకొని ఏమైతే అయిందని ముందడుగు వేసాడు, గణేష్.
"లేడీస్ అండ్ జెంటిల్మెన్, గౌరవనీయులైన మేడంగారి నిర్ణయం తెలిసి కొన్ని నిమిషాలే అయింది. వారి ఉద్దేశ్యం అత్యంత శ్లాఘనీయం. కొన్ని శతాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి అనే ఈ కుళ్ళును అంత త్వరగా నిర్మూలించడం సాధ్యమా? నిజమే ... ఆ అనుమానం నాకూ వచ్చిన మాట వాస్తవమే. కానీ ప్రయత్నించడంలో తప్పులేదు. అదేదో తూతూమంత్రంగా కాకుండా ఒక పథకం ప్రకారం ముందుకు సాగాలి. వారి ఉద్దేశ్యం ప్రకారం ఈ కార్యసాధనకి ఒక క్రొత్త ఆంబుడ్స్మన్ వ్యవస్థని రూపొందించవలసిందని ఆదేశించారు. అది ఆ దివంగత మహానేత పేరున జిల్లాలవారీగా ఎంపికచేసిన కార్యదక్షులైన యువకులతో కూడిన ఒక ఫోర్సు. జిల్లాకి పదిమంది చొప్పున రెండువందలయాభై మంది, రాజధానిలో మరో ఇరవైమంది. వీరుగాక ఈ ఫోర్సుకి నాయకునిగా అవినీతికీ, బంధుప్రీతికీ అతీతుడైన ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఈ ఫోర్సు నియామకాలలో ఎటువంటి బంధుప్రీతికీ తావు ఉండరాదని మేడం ఉద్దేశ్యం. ఆ బాధ్యతను నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని శ్రీ నరసింహారావుగారు నాకు సహకరిస్తారు. అర్హులైన సాంఘిక దృక్పథం కలిగిన యువకులను ఇంటర్వ్యూ చేసి వారి నియామకాల్ని వచ్చే మూడునెలల్లో పూర్తిచేయడమే కాక ఆ ఫోర్సు నాయకుని నియామకం విషయంలో కూడా ఒక షార్ట్ లిస్ట్ సిద్ధంచేయాలని నన్ను ఆదేశించారు. ఒకసారి నాయకుడిని నిర్ధారించాక ఇక ఈ ఫోర్సుతో నాకు కూడా ఎటువంటి ప్రమేయమూ ఉండదు. పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలంటే అదోక్కటే దారి. ఆ ఫోర్సుయొక్క అధికారాలను నిర్దేశించే బ్లూ ప్రింటు ఇంకో పదిరోజుల్లో మేడంకి సమర్పించబోతున్నాను...."
"దాని ఆధారంగా కావలసిన ఎక్సిక్యుటివ్ ఆర్డర్సు, ఈ క్యాబినెట్ అనుమతితో సిద్ధంచేసి ప్రచురించడమే మన తదుపరి కార్యక్రమం", అంటూ తన మాటలకి అడ్డువచ్చింది, మేడం.
---
పత్రికలో ప్రకటనలకి అప్లికేషన్లు లక్షలకొలదీ వచ్చిపడ్డాయి. టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్రొఫెసర్లతో కూడిన ప్యానెల్ ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన యువతీయువకులను జిల్లాలవారీగా ఇంటర్వ్యూలు చేసి ఫైనల్ లిస్టుని సిద్ధంచేయడంలో రెండునెలలు క్షణం తీరికలేకుండా గడిచిపోయాయి. ఐతేనేం? ఆ పని గణేష్కి ఎంతో తృప్తిని ఇచ్చింది. ఇక నాయకుని నియామకానికి క్యాండిడేట్ల లిస్టు తయారుచేయడమే మిగిలింది.
"మీరు ఇచ్చిన లిస్టులో అందరూ ఈ బాధ్యతకి అర్హులే. వీళ్ళలో ఐదుగురిని మాత్రమే ఎంపికచేసి మేడంకి సమర్పించాలి", అంటూ నరసింహారావు ఇచ్చిన పన్నెండు మంది లిస్టుని దీక్షగా పరిశీలించసాగాడు గణేష్.
"వీరందరూ తమతమ ఉద్యోగాలను వదిలి ఐదేళ్ళు డిప్యుటేషన్ మీద ఈ బాధ్యతని స్వీకరించేందుకు అంగీకరించారు. ఇందులో నలుగురు ఐయ్యేయస్, ముగ్గురు ఐపీయెస్, ఇద్దరు జడ్జీలు, ఇక మిగిలిన వాళ్ళు, ఫారెస్ట్, ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ డిపార్టుమెంట్లలో అధికార్లు. వీళ్ళలో ఐదుగురిని ఎంపిక చేయడం నీకే వదిలేస్తున్నాను. వారంలోగా లిస్టు మేడంకి సబ్మిట్ చేయాలి, నీ యిష్టం", అంటూ కుర్చీలో జారగిల పడ్డాడు, నరసింహారావ్.
"సింపుల్ సార్ ... వీళ్ళ కాన్ఫిడెంషియల్ ఫైల్సుతోబాటూ వీరి వీరి ఫ్యామిలీ హిస్టరీ సిద్ధం చేయండి. ఎవరి బంధువర్గంలో రాజకీయనాయకులూ, ప్రభుత్వాధికార్లూ లేరో ఆ ఐదుగురినీ మేడంకి ఇద్దాం. ఆమె చెప్పినట్లు బంధుప్రీతికి ఎటువంటి తావూ ఉండదు", అంటూ నరసింహారావు వంక చూసాడు.
ఆ క్షణంలో అతడి ముఖంలో తొంగిచూసిన చిరునవ్వులోని అంతరార్థం మాత్రం గణేష్కి గోచరించలేదు.
---
"వెల్ డన్ మిస్టర్ గణేష్. ఇంతకొద్ది కాలంలో మీరు సాధించినది అసామాన్యం. వీయార్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి జిల్లాలో, ప్రతి మీడియాలో ఇదే విషయం. దేశమంతా దీని గురించే చర్చ. ఎక్సెలెంట్!" మేడం ఛేంబర్లో ఆమెతో నరసింహారావూ, అతడూ తప్ప వేరెవ్వరూ లేరు.
"థాంక్యూ మేడం. మీరు ఆదేశించిన విధంగా ఎటువంటి వత్తిడికీ లొంగకుండా, పని పూర్తిచేసాం. ఇక నాయకుని ఎంపిక మాత్రమే మిగిలింది" అని నరసింహారావు వంక తిరిగి చిరునవ్వు నవ్వి చేతిలోని కాన్ఫిడెంషియల్ ఫైలు ఆమె చేతికందించాడు, గణేష్. అతడి ముఖం వేయి విద్యుద్దీపాల కాంతితో వెలిగిపోతుంది.
"గుడ్ వర్క్, గుడ్ వర్క్" అంటూ అతడి చేతిలోని ఫైల్ అందుకొని, "వచ్చేనెల నాయన వర్ధంతికి, ఈ నాయకుని నియామకం న్యాషనల్ మీడియాలో ప్రకటించాల", అంటూ ఫిలులోని ఒకేఒక పేజీ వంక దృష్టిసారించింది, మేడం.
లిస్టులో పేర్లు చదువుతున్న మేడం ముఖంలో రంగులు మారసాగాయి. ఎర్రబడిన కళ్ళతో నరసింహారావు వంక చూస్తూ, "ఏమప్పా, నీవన్నా చెప్పేపండ్లా? ఇంతకాలం ఈడనే ఉండావ్ కదా? ఇంత ఎక్స్పీరియెంస్ ఏటికి? కాల్చేటికా? ఇందులో నా బావమరిది పేరేదీ?" అంటూ ఫైలుని గణేష్ ముఖం మీదికి విసిరింది, మేడం.
---

1 comment:

  1. I think I know who the madam character is based on. Well crafted. Enjoyed reading it.

    ReplyDelete