Search This Blog

Thursday, November 24, 2011

శ్రీరామజ్వరం

గత పాతికేళ్ళుగా తెలుగులో పౌరాణిక సినిమా వచ్చినట్లు గుర్తులేదు.

బాపూ సినిమా! 
సినిమా రిలీసయింది అని తెలియగానే..... సినిమా ఫీవర్ పట్టుకుంది.

ఎక్కడ ఆడుతుందో అని పేపర్లో చూసాను. ఇంటికి దగ్గరగా ఒకటే మల్టీప్లెక్స్, ఫేమ్ లిడో, బెంగుళూరు ఎమ్ జీ రోడ్డు దగ్గర. వెళ్దామంటే రెండు రోజులు తీరిక లేకపోయింది.


ఆలస్యం అయ్యే కొలదీ జ్వరం తీవ్రమైంది. 

తోడుగా రమ్మంటే ఎవరికీ ఆసక్తి లేదు. భార్య బంగారాన్ని పిలిస్తే, పౌరాణికాలు తనకు గిట్టవని తెగేసి చెప్పేసింది. ఇక బంగారు సీతలెవరినైనా పిలిస్తే వచ్చి ఉండేవాళ్ళేమో? కానీ ఏకపత్నీవ్రతుడి సినిమా కదా, బాగుండదేమో ;)
ఉదయాన్నే లేచి, ఐదు గంటలు గాల్ఫ్ కోర్సులో వృక్షాలూ, పక్షుల మధ్య వనవాసం చేసి, స్నానాదులు, అంటే బ్రేక్ఫాస్టూ కాఫీ లాంటివి అనమాట, ముగించి, ఒంటిగంటకు ఒంటరిగా సినిమా హాలుకి చేరాను. సినిమా ఒకటీ నలభైకి. బాక్సాఫీసులో టికెట్లిచ్చే పిల్ల, "చిన్న ప్రాబ్లం సార్" అని టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లమేమో అనుకుంటూ...
"కారు పార్కింగులో పెట్టి వచ్చేదా? షో అయితే ఉంది కదా?" అని అడిగాను.
"అదే ప్రాబ్లం సార్. మీరే చూడండి. బుకింగులు సున్నా! సేల్సు సున్నా! ఈ షో కి వచ్చిన ఒకే ఒక వ్యక్తి మీరే. కనీసం ఆరుగురైనా లేకపోతే సినిమా వెయ్యడం సాధ్యంకాదు. కాసేపు ఆగండి, ఇంకెవరైనా ఐదుగురు వస్తే టికెట్లు ఇస్ష్యూ చెస్తాను", అన్నది.
సరే ఇంకేం చేస్తాం? సిగరెట్టు వెలిగించి రామభజన చేస్తూ బాక్సాఫీసు బయట కూర్చున్నాను. అంతలో కోరిన వరాలిచ్చే వనదేవతల్లా అలంకరించుకొని, శబరిమాతలాంటి వృద్ధురాలికి తోడుగా ఇద్దరు స్త్రీలు వచ్చారు. వాళ్ళకి విషయం చెప్పి, "ఇంకో ఇద్దరన్నా కావాలి, మీఇంట్లో వాళ్ళు కానీ, చుట్టాలో ఫ్రెండ్సో వస్తారేమో ప్రయత్నించ" మని బతిమాలాను. పాపం ఫోన్లో చాలమందినే అడిగిందామె. ఫలితం లేదు.
ఈలోగా ప్రక్కనే కూర్చొని తన గర్ల్ ఫ్రెండు కోసం వేచిచూస్తున్న ఒక బెంగాలీ యువకుడితో మాటకలిపాను. ఏ సినిమా అనేదీ అతను ఇంకా నిర్ణయించుకోలేదు. అదీ మనమంచికే. "చూడు బాబూ, ఈ సినిమా అయితే హాల్లో మేము నలుగురం తప్ప ఇంకెవరూ ఉండరు. మేమూ వెనక్కి తిరిగి చూడం. సినిమా మీకు అర్థంకాదు కాబట్టి, ఎటువంటి డిస్టర్బెన్సూ ఉండదు. నీవూ నీ గర్ల్ ఫ్రెండూ కనుక టికెట్ తీసుకుంటే, అంతా కలిసి ఆరుగురు అవుతాం".
నా అదృష్టానికి ఆ అబ్బాయి "సై" అన్నాడు.
ఆవిధంగా హాలులోకి ప్రవేశించి ముందు సీట్లో కూర్చున్నాను.
హాలు గోడలు చూస్తుంటే అదొక ’డెజావూ’ లా అనిపించింది. ముప్పై ఐదు ఏళ్ళ క్రితం, తిరుపతి. అదీ బాపూ సినిమాయే! సీతాకళ్యాణం. తిరుపతిలో నా అదృష్టం కొలదీ I. S. మహల్ సినిమాహాలు ఓనరు పాపం ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కున్నాడట. ఆ ఒక్క ఊళ్ళోనే ఆ సినిమా నెలరోజులకు పైగా ఆడింది. సెలవలకి తిరుపతిలో ఉన్నానేమో, రోజూ రెండోఆటకి సువేగా మోపెడ్ వేసుకోని నేను రెడీ. ఒక్కరోజు కూడా విడువకుండా కనీసం ఇరవై సార్లన్నా చూసి ఉంటాను. చాలా సార్లు మొత్తం హాల్లో నేను ఒక్కడినే.

ఈ ముప్పై సంవత్సరాలలో, ఆ సినిమా కనీసం వందసార్లన్నా చూసాను. ఇక ఈ రామరాజ్యం ఎన్నిమార్లు చూస్తానో?


అనుకున్నట్లుగానే, త్యాగయ్య పదాలలో శ్రీ రామ పురప్రవేశంతో సినిమా మొదలయింది.
అద్భుతం!
అప్పుడు నోరు తెరిస్తే, సినిమా అయ్యేవరకూ మూతబడలేదు. ఏవో ఒకటి రెండు క్షణాలు తప్ప ఎక్కడా అపశృతి లేదు.

ఎన్టీయార్ కొడుకు రాముడు? పర్వాలేదు. తెలుగు సరిగ్గా ఉచ్చరించడం రాకపోయినా విగ్రహం బాగానే ఉంటుంది. కథలో రాముడు కూడా నవయువకుడు కాదుకదా, కాస్త పెద్దతరహా పాత్రే. ముఖంమీద ముడతలూ, కళ్ళకింద సంచులూ కనిపించినా అంత అనౌచిత్యంగా అనిపించలేదు. ఇక కౌసల్య పాత్రలో కే ఆర్ విజయ. మరీ వయస్సు ఎక్కువైపోయింది. కొంచెం మధ్య వయస్కురాలెవరైనా అయితే బాగుండేదేమో? అదే విధంగా, వశిష్ఠుడిగా బాలయ్య (హీరో బాలయ్య కాదు) మరీ వృద్ధుడై పోయాడేమో, మాటలు సరిగ్గా పలకలేక పోయాడు. వైయ్యాకరణి, సాధువూ, పురోహితుడిగా సరిపోలేదనిపించింది. ఇక అయోధ్యా పురజనుల రూపురేఖలు బాపూ సినిమాకి తగినట్లు లేవు. జూనియర్ ఆర్టిస్ట్ గిల్డ్ ప్రభావమేమో? ముందు వరసలోని పురజనం విషయంలోనైనా కాస్త జాగ్రత్త తీసుకొని ఉండవలసింది. ఉదాహరణగా, సీతాకళ్యాణంలో, రాముడు మిథిలా నగరం ప్రవేశించినప్పటి సన్నివేశంలోని జనాన్ని, ఈ సినిమాలో లవకుశులు అయోధ్యా నగరంలో పాడుతున్నప్పటి సీన్ తో పోల్చిచూస్తే తెలుస్తుంది.

ఐతే, మిగిలిన వాళ్ళంతా పాత్రలకి అతికినట్లు సరిపోయారు: సీతా, లక్ష్మణుడు, పిల్లలు - లవకుశులు. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రిందటి, మహాబలిపురపు బాలరాజుకి, హనుమంతుణ్ణి సంధించి చేసిన ప్రయోగం అద్భుతంగా ఉంది. వృద్ధ వాల్మీకిగా, కథకు సూత్రధారుడిగా ఇంకో బాలరాజు, మహా 'ఋషి' నాగేశ్వరరావు. రాముడి కథ చెప్పడం వారికి ఎప్పటినించో అలవాటే. భూకైలాస్ లో నారదుడిగా మొదలుపెట్టారు. అందాలరాముడుగా, భధ్రాచల స్థలపురాణం ఆయనతో బాపూ రమణలే కదా చెప్పించారు? 

దృశ్యకళ అసమానంగా ఉంది. అయోధ్య రాచనగరి మధ్యయుగపు భారతీయ శిల్పకళా సంస్కృతికి అద్దం పట్టినట్లు ఉంది. ద్వారసముద్రపు (హళేబీడు) గోడలూ, అర్భుదనగపు (మౌంట్ అబూ) జినాలయాల స్థంభాలూ, కాకతీయ తోరణాలూ అన్నీ ఒకేచోట! నయనానందకరం.

ఇక చిత్రకల్పన, సంగీతం విషయం చెప్పడం అనవసరం. అది బాపు బొమ్మ. జగదానందకారకం. పుష్పకంలో సీతారాముల్ని చూసినప్పుడు మొదలైన ఉద్వేగపు కన్నీళ్ళు వైకుంఠారోహణం వరకూ కారుతూనే ఉన్నాయి. దానికి తోడు కథ మొదటి సగం కరుణరస ప్రధానం. రెండు చేతిగుడ్డలు పూర్తిగా తడిచిపోయాయి.

ఈ జ్వరం ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడంలేదు.
ఔషధం, రామరసమే!
వైద్యుడు బాపూ.
దీర్ఘమైన చికిత్స - సినిమాహాలు ఇంజెక్షన్ల తర్వాత, డీవీడీ మాత్రలతో చాలారోజులే అవసరం!
ఇక చివర్లో, రాముడు, సోదర సహితుడై చేసిన మహాభినిష్క్రమణంకి బదులు ఒంటరిగా ఏడు వాకిళ్ళు దాటటం కొంచెం నిరుత్సాహపర్చింది. 
అయితేనేం? 
కావ్య ఫలశృతులే నిజమైతే, ఈ దృశ్య కావ్యాన్ని చూసిన వాళ్ళందరూ ఆ ఏడు తోరణాలూ దాటి ఆ వైకుంఠునిలో ఐక్యం కాగలరు.
రమణ గారు సినిమా చూసి ఉంటే ఎంత ఆనందించేవారో?