Search This Blog

Monday, April 29, 2013

Rashtra Vibhajana

వెనుకచూపు

హైదరాబాదులో ఒక వారం... ఎక్కడకి పోయినా ఒకటే డిస్కషన్
రాష్ట్రం విభజించాలని కొందరూ, వద్దని కొందరూ... పరస్పర విరుద్ధమైన వాదనలు. మనవాళ్ళు ఒకళ్ళ మాట ఇంకొకళ్ళు ఎలాగూ వినరు. ఆర్గ్యుమెంట్లు తెమలవు. వినేవాళ్ళ తల బొప్పికట్టాల్సిందే! అందరూ ముందు చూపుతో ఏవేవో రీజన్స్ ఇస్తున్నారు. నాకైతే మనవాళ్ళకి ఉన్నంత ముందుచూపు లేదు. అందుకే వెనుకచూపుతో ఆలోచించాను... అప్పుడు నాకొక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. అది రాష్ట్రవిభజన వలన మన తెలుగువాళ్ళకి కలిగే ఒక ముఖ్యమైన లాభం.
అవి...
ఇరవైయ్యో శతాబ్దం మొదటి రోజులు,
అవి రామస్వామి నాయకర్ ద్రవిడ వాదం ఊపందుకొంటున్న రోజులు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులకి సమైక్య భారతదేశం అనే కల నిజమౌతుందో లేదో అనే భయం. ఒకవైపు మహమ్మద్ ఆలి జిన్నా దేశాన్ని మతప్రాతిపదికపై ముక్కలు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ మద్రాసులో ప్రత్యేక ద్రవిడ దేశం అనే నినాదాలు బయల్దేరాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీని భాషాప్రాతిపదికపై నిర్మించాలని మహాత్ముని నిర్ణయం వాళ్ళకి తలపోటుగా పరిణమించింది. ఐరోపాలోలాగా భాషని బట్టి దేశాలైతే, భారతదేశంలో చిన్నచిన్న దేశాలు పుట్టగొడుగుల్లా ఉద్భవిస్తాయేమో అని నెహ్రూగారి భయం. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. వాళ్ళందరూ కనుక ఏకమైతే ఇవాళ కాకపోయినా రేపైనా భారత ప్రభుత్వానికి తలనొప్పి తప్పదు.
అప్పటి మద్రాస్ నగరంలో 38% తెలుగు వాళ్ళైతే, తమిళులు 32% మాత్రమే. ఇక బెంగుళూరు, కోలార్ జిల్లాలలో తెలుగువాళ్ళ సంఖ్య 54%, కన్నడీగులు 22%. అప్పటి సేలం జిల్లాలోని క్రిష్ణగిరి తాలూకాలో మెజారిటీ తెలుగు వాళ్ళే. కానీ అది రాజాజీగారి జన్మస్థలం, ఆయన నియోజకవర్గం. ఇక సీడెడ్ జిల్లాలలో బళ్ళారి పట్టణంతో సహా జిల్లాలోని తూర్పు ప్రాంతం అంతా తెలుగువాళ్ళే. రాష్ట్ర విభజన కమిటీ కూడా దాన్ని ఆంద్ర రాష్ట్రంలో కలపాలని నిర్ణయించింది, కానీ లాభం లేకపోయింది. ఇక కోలార్ జిల్లాని అంటే బెంగుళూర్ రూరల్ జిల్లాతో సహా ఆంధ్రలో కలపాల్సింది. కానీ ఆ పట్టణానికి మైసూర్ రాజ్యంతో ఉన్న సంబంధాల ద్రుష్ట్యా మైసూరులో కలిపారు. కోలారుని కనుక ఆంధ్రాలో కలిపితే హోసూరు, ధర్మపురి ప్రాంతాలని కూడా ఇవ్వాల్సివస్తుందని రాజాజీ భయం. దానితో తెలుగు వాళ్ళ మెజారిటీ ఉన్నా కూడా మద్రాస్, బెంగుళూర్ నగరాలు వేరే రాష్ట్రాల రాజధానులయ్యాయి. ఇక గంజాం జిల్లాలోని పర్లాకిమిడి, బరంపురం తాలూకాలు సరే సరి, ఇంతకు ముందే ఒరిస్సాలో కలిపారు. పాపం వాళ్ళకి దక్షిణ ఒరిస్సాలో పెద్ద పట్టణం ఏదీ లేదట. అందుకని బరంపురాన్ని దానం చేసారు. తరువాత హైదరాబాదు పోలీస్ యాక్షన్ వల్ల హైదరాబాదు రాజ్యంలో తెలుగు మాట్లాడే జిల్లాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. కానీ ఇక్కడ కూడా రాయచూర్, గుల్బర్గా జిల్లాలలోని తెలుగు మెజారిటీ తాలూకాలు మైసూరుకీ, సిరోంచా, చాందాలు మధ్యప్రదేశ్, మహరాష్ట్రలకీ పోయాయి. ఈ విధంగా భౌగోళికంగా తెలుగు రాష్ట్రాన్ని ఎంత చిన్నది చేయగలరో అంత చేసారు.
కానీ మనవాళ్ళకి అదేమీ పట్టదు. ఉన్నదాన్ని కూడా ఇంకా ముక్కలు చేద్దామని పట్టుబట్టి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం.
చరిత్ర చూస్తే దేశాన్ని విడదీయటంలో, విడిపోవటంలో మనవాళ్ళు ట్రెన్డ్ సెట్టర్స్. మనం ఏంచేసినా కాస్తో కూస్తో ఆలశ్యంగా దేశమంతా అదే ఫాలో అయింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఒక ఉదాహరణ మాత్రమే. తెలుగు మాట్లాడే ప్రదేశాన్ని ఏదో రెండుమూడు ముక్కలు కాకుండా సపోజ్ ఆరో, ఏడో చేసామనుకోండి. రేపు అదే ఫార్ములా మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అయితే, పక్క రాష్ట్రాల్లోని తెలుగు మెజారిటీ ముక్కలు కూడితే, తెలుగు మాట్లాడే రాష్ట్రాల సంఖ్య ఒక పదీ పన్నెండు అవ్వచ్చు.
ఒక విధంగా అదే మంచిదేమో!