Search This Blog

Monday, February 11, 2013

Bapu Ramana la Bhagavatam (Telugu)



2004 సమ్మర్లో, మార్కెట్ విజిట్కి హైదరాబాదు వెళ్ళాను. అక్కడ హోటల్లో మిత్రుడు సుబ్బారావ్ గారు కలిసాడు. మాటల్లో అప్పట్లో ఈనాడు టీవీలో మొదలైన భాగవతం గురించి ఏదో కాసేపు డిస్కషన్ జరిగింది. "బాగా చెప్పారు సార్, వ్రాసిస్తే మా మాగజైన్లో వేస్తాం", అన్నాడాయన. "తెలుగులో అక్షరం ముక్క రాసి పాతికేళ్ళయింది సార్, నావల్ల ఏమవుతుంది", అన్నానప్పుడు. కానీ, నాలుగు పెగ్గులు దిగాక ధైర్యం వచ్చింది. తాజ్ బంజారా స్టేషనరీ మీద వ్రాయడం మొదలెట్టాను. తెల్లారి పోయింది. ప్రొద్దున్నే ఫోన్ చేసి ఆయనకి ఇచ్చేసాను. రెండు విడతల్లో వాళ్ళ సినిమా పత్రిక మెగా పోస్టర్లో ప్రచురించారు. చాలారోజుల తరువాత ఇల్లు మారుస్తుంటే ఆ కాపీలు కనిపించాయి.
ఈటీవీలో భాగవతం మొదట్లో బాపుగారే డైరెక్ట్ చేసారు. కాని ఆ తరువాత అది చేతులు మారడంతో బ్రష్టు పట్టింది. ఇది వ్రాసినప్పటికి మాత్రం టీవీ భాగవతం ఇంకా బాపూ రమణలదే. మళ్ళీ ఎక్కడో మాయమవకుండా అందుబాట్లో ఉంటుందని బ్లాగ్ లో పెడుతున్నాను, అదే అదనుగా మీతో కూడా పంచుకోవచ్చని కూడా.

---
బాపూ రమణల భాగవతం
(మెగా పోస్టర్ పత్రిక జూన్ 19, 26 సంచికల నుండి)

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మనోఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్ప తరువుర్విన్ సద్విజ శ్రేయమై
భాగవతం
ఈ వేదవ్యాసం గురించి వ్యాసం వ్రాయాలంటే ప్రప్రథమంగా గుర్తుకు వచ్చేదీ పైపద్యం. కానీ ఈ పద్యం చెప్పినాయన, తనదైన ఈ భాగవతానికి ఆ వేదవ్యాసుని పురాణమే మూలమన్నాడు. అయితే, కావచ్చు, నాకుమట్టుకూ, ఆ వేదవ్యాసుడంటే కాళిదాసు సినిమాలోని బొజ్జ బాపనయ్య లేదా మహాభారతంలో బెస్తపిల్లకి పుట్టిన నల్ల బాపనయ్య మాత్రమే.
తెలుగు భాగవతం
పద్దెనిమిది పురాణాలుంటే, వాటికి లేని ప్ర్రాముఖ్యత ఈ భాగవత పురాణానికి ఎందుకో? ఇది గొప్ప పురాణమవడంవల్లకాదు, వ్యాసునిచే వ్రాయబడుటవల్లాకాదు, మరి ఆ చిలుక ఋషి పలికినందువల్లా రాలేదు. మన తెలుగుదేశంలో త్రికవుల భారతంకన్నా, మనుచరిత్రాది ప్రబంధాలకన్నా ఎక్కువ ప్రాచుర్యం ఈ భాగవతానికే. కానీ, ఈ పాప్యులారిటీ భాగవతానికంతటికీ లేదు, దీనిలోని కొన్ని కథలకు మాత్రమే. రుక్మిణీ కళ్యాణమో, గజేంద్ర మోక్షమో అవనివ్వండి. వామన, ప్రహ్లాద చరిత్రలు కానివ్వండి. ఈ కథలు ఇంత బాగా ప్రాచుర్యం పొందడానికి కారణం మూలంలోని గొప్పతనం కన్నా, ఆ కథలను తెలుగులో చెప్పిన పోతనగారి కవనా వ్యవసాయముయొక్క సొగసుతనమనే చెప్పాలి.
భక్తపోతన సినిమాలోలాగా ఆయన నాగలి పట్టాడో లేదోకానీ, సంస్కృత మూలగ్రంథంలో బీజమాత్రంగా ఉన్న కథలను ఇంతింతైవటుడింతయై అన్నట్లుగా పెంచి అపర సాహితీ కల్పతరువుగా మన తెలుగింట నిలబెట్టిన ఈ కల్పనా కర్షకుడు నిజంగా రైతే.
మధ్యయుగంలో భారతదేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఒక ఊపందుకుంటున్నప్పుడు, మన తెలంగాణంలో భక్తిరస ప్రధానంగా, పండిత పామరులను సమానంగా అలరించగల సాహిత్యం కరువయ్యింది. అరవదేశంలాగా మనకి ఆళ్వారులూ నయనార్లూ లేరు. కన్నడపు బసవన్నలూ లేరు. భక్తతుకారాంలు, తులసి, కబీరు, సూర్ దాసులు లేరు. కానీ భక్తి పాకాన్ని ఊరూర, ఇంటింటా తిరిగి పంచిన వేయిన్నొక్క హరిదాసులకూ, వీధి భాగవతులకూ కావలసినంత మూలద్రవ్యాన్ని ఫలసాయంగా ఇచ్చి సంస్కృతీ పరంపరను, పామరులు సైతం సులువుగా పలుకగల పద్యాల రూపంలో శతాబ్దాలపాటూ నిలిపిన బమ్మెరపోతనకు మనమెల్లరం కృతజ్ఞులం.
పౌరాణిక సినిమా - నాటకమూ
తెలుగు చలన చిత్ర రంగంలో పౌరాణిక చిత్రాలు మొదట్లో మన నాటకాల పధ్ధతిని అనుసరించి వచ్చాయి. ఈ నాటకాలకు వరవడి పాశ్చాత్య నాటకాలనుండి వచ్చింది. అయినా శతాబ్దాలుగా వేళ్ళూనిన మన పద్య పరంపర తెలుగు నాటకంలో ఎంతో ఉత్కృష్టస్థానం వహించి, మన నాటక సంప్రదాయానికి ఒక తనదైన రూపం ఇచ్చింది. తిరుపతి వేంకటకవుల పద్యాలు ఎంత పాప్యులరయ్యాయంటె, అవి లేకుండా భారతపు కథలను సినిమాగా తీస్తే, ఎంత పెద్ద బడ్జెట్టయినా బాక్సాఫీస్ లో ఎదురు దెబ్బలు తినాల్సిందే, కురుక్షేత్రం, సినిమా దీనికి ఒక మంచి ఉదాహరణ.
ఆ సమయంలో దృశ్య శ్రవణ మాధ్యమం అంటే ఆడియో విజువల్ మీడియం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దాని పూర్తి సామర్థ్యం గ్రహించి ఉపయోగింపగల దర్శకులూ, దార్పణికులు బహుకొద్దిమంది. వీరిలో సాంప్రదాయిక సాహిత్యముతో మరియూ పురాణేతిహాసముల కథలూ మరియూ పాత్రలతో పరిచయమున్న వారు మరీ తక్కువ. నాటక సాంప్రదాయానికి భిన్నంగా పౌరాణిక కథలకు తెర రూపం కల్పించి ప్రేక్షకుల ఆమోద మొందినవారెవరనేది ఒకసారి పరిశీలిద్దాం. 
పౌరాణికాలలో మనదైన వరవడి 
భక్తప్రహ్లాదలో రోజారమణి
మొట్టమొదటగా చెప్పుకోవలసినవారు, విజయద్వయం, నాగిరెడ్డి చక్రపాణులు. పురాణాలలోని ఒక పిట్టకథను పట్టి, పాత్రల స్వభావాలు, ఔచిత్యాలు చెడకుండా, వీలైనంత పోయెటిక్ స్వాతంత్ర్యంతో ఒక మామూలు ప్రేమకథను పౌరాణిక చిత్రంగా చూపించి మాయ చేసిన దిట్టలు. ఒక చిన్నకథను మూడు గంటల సినిమాగా పెంచి, కథనంలో బిగి సడలకుండా మరో వందేళ్ళు నిలిచేలా తీసిన మాయాబజారుఅందుకే ఒక క్లాసిక్ అయింది.

భూకైలాస్ లో నారదుడుగా నాగేశ్వర్రావ్
ఆ తరువాత తెలుగు సినిమా చరిత్రలో భారతంలోని వివిధ ఘట్టములు మినహా వేరే పౌరాణిక కథలను పూర్తి చిత్రాలుగా తీసిన తెలుగువారు లేరు. అవడానికి అరవవారయినా ఆంధ్ర భాగవతంలోని ఒక కథకి పూర్తి సినిమా రూపమిచ్చిన ఘనత ఏ వీ మెయ్యప్పన్ గారికే దక్కుతుంది. అది నారాయణమూర్తిగారి భక్తప్రహ్లాద’. చిత్రపుపూర్వమే ఏవీయెమ్ వారో స్థల మహత్యాన్ని భూకైలాస్గా చూపించారు. ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే మొట్టమొదటిసారిగా నారదుని సూత్రధారిని చేసి, కూచిపూడి భాగవతుల కథనా సాంప్రదాయాల ఆధారంగా ఒక మామూలు కథకు హాస్యాన్ని జోడించి జనరంజకం చేసారు. నారదుని వేషమూ, కట్టూ కూచిపూడి భాగవతులను తలపింపజేసేవిగా మలచబడ్డవి. ఇదే టెక్నిక్ ని ఉపయోగించి రుక్మిణీ కళ్యాణం కథను శ్రీకృష్ణపాండవీయంలో ఒక భాగంగా మన తారకరాముడు తీర్చాడు. నలభైయైదు నిమిషాలు సాగే ఈ కథ ఒక బ్యాలెలాగా సాగింది. 

బాపూగారి చిత్రకల్పన 
అందాలరాముడు
బాపూగారి కథనం కూడా ఈ కోవకి చెందిందే. ఐతే శిల్పం అంటే ఐకనోగ్రఫివిషయంలో వీరిదొక సరికొత్త బాణీ. వీరి కుంచెనుంచి చిందిన చిత్రాలలాగానే వీరి పౌరాణిక పాత్రలు కూడా చాలా సహజమైన దుస్తులు, ఆభరణాలలో కనిపిస్తాయి. మనదైన జానపద హస్తకళా శిల్పం, పాత్రల వేషధారణలోనే గాక వెనుకవున్న వస్తు, వాస్తులలోనూ చూడవచ్చు. ఈ తరహా చిత్రకల్పనకి మచ్చుతునకే, ‘సంపూర్ణ రామాయణంసినిమాలోని గుహుని ఘట్టం. అందాలరాముడు చిత్రంలో భద్రాచల స్థల పురాణం వీరు హీరో నాగేశ్వర్రావు గారిచేత చెప్పించారు. ఈ ఘట్టంలో బాపూగారి బొమ్మలు ఒక సైడ్ షోలా కథకు తోడ్పడ్డయి. అందులో విష్ణువు ఆ కొండకి పరుగున వచ్చే సన్నివేశం, భాగవతంలోని గజేంద్ర మోక్షం స్ఫురింపజేసింది. ఈ విధంగా బాపూగారి భాగవతం ఫ్లేవర్ ను, తెలుగు సినిమా ప్రేక్షకులు మొదటిసారిగా రుచి చూసారు. తరువాత, ఈ విధమైన కథలు చెప్పడంలో వీరి కుంచె బొమ్మలేకాదు, కదిలే బొమ్మలు కూడా ఆ స్థాయి వేనని నిరూపించింది భక్తకన్నప్పసినిమాలోని కిరాతార్జునీయం కథ.


బాపూ - భక్తి 
బుద్ధిమంతుడు
అందమయిన బొమ్మలు, సన్నివేశాలతో మాత్రమే సినిమా పూర్తికాదు. సినిమా ఒక కళ మాత్రమే కాదు. ఒక మాధ్యమం కూడా. దీనిలో ఒక కథ చెబితే, దానిలోని భావన చూసేవాడి గుండెలోకి జొరబడగలగాలి. భాగవతపు కథలు భక్తిరస ప్రధానాలు. తెలుగు సినిమాలలో భక్తిని రక్తి కట్టించిన విషయంలో బాపుగారిదే పైచేయి. బుద్ధిమంతుడుచిత్రంలోని పూజారి, ‘ముత్యాలముగ్గు చిత్రంలోని ఓ పదేళ్ళపాప పాత్రల సాయంతో, మనస్సులో, పూజగదిలో, పద్యాలలో, స్తోత్రాలలో ఉండే భక్తిని బయటకి లాగి పెరట్లోకి, వీధిలోకి, మామూలు మాటలలోకి జొప్పించగల్గడం ధృఢమైన భక్తిలేని వానికి అసాధ్యం. ఒకప్పుడు, అంటే నా చిన్నప్పుడు, ఆయన ముఖం పోర్ట్రయిట్ లో చూడకమునుపు, ఆయన ముఖాన్ని ఊహిస్తే హనుమంతుడు స్ఫురించేవాడు. ఇప్పటికీ ఆ ఊహ నాకేమీ విడ్డూరం అనిపించదు. బాపూగారి పేరుకి రమణ గారిని అంటించి చూస్తే కనిపించేది విస్డమ్, నాలెడ్జ్, క్రియేటివ్ ఎబిలిటీ మరియూ భక్తి. ఇది పూర్తిగా హనుమద్దర్శనమే.
ఇక రమణగారి విషయానికొస్తే, వీరిరువురూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనిపిస్తుంది. మన సంస్కృతిలో మేల్ బాండింగ్అనేది ఈనాటిది కాదు. ఇంద్రవరుణులు, గిల్గమేష్-ఎంకిడూలు, నరనారాయణులు, కృష్ణార్జునులు, చాణక్య చంద్రగుప్తులు, భట్టి విక్రమార్కులు, భోజకాళిదాసులు, అక్బర్ బీర్బల్ ఇలా ఎన్నో ఉదాహరణలు. కళాసృష్టి జరగాలంటే రెండు మేధస్సుల కలయిక ఎస్సెన్షియల్ కాకాపోయినా, చాలా ఎఫెక్టివ్ అని మాత్రం చెప్పగలం. బాపుగారి బొమ్మలకి, రమణగారి మాటలు జోడయితే తనివారా వినడం, మనసారా కనడం ఆనందకరమే.  
సీగానపెసూనాంబా నన్ను పెళ్ళాడుతావురా అండీ?
రమణగారి హాస్యం
భాగవతం అనే ఈ హరికథ ఎంత భక్తి ప్రధానమైనా, మన తెలుగువారికి హాస్యం లేకపోతే గోవిందే. రమణగారి రచనలు మొదటినించీ హాస్యరస ప్రధానాలు. జనతా ఎక్స్ప్రెస్, ఋణానందలహరి, బుడుగువంటి పుస్తకాలలోని పాత్రలు సినిమారంగంలో అంతగా రాణించకపోయినా, వీరు సినిమాకోసం సృష్టించిన కొన్ని పాత్రలు ప్రేక్షకుల అశేషాదరణ పొందటమేగాక, ఆ తరువాత వచ్చిన సినిమాలకి వరవడి అయ్యాయి. అందాలరాముడులోని తీతా’, ముత్యాలముగ్గులోని కాంట్రాక్టరు పాత్రల నీడలు ఇప్పటికీ కోట శ్రీనివాసరావు టైపు కామెడీ-విలన్ పాత్రలలో చూస్తున్నాం. 
అలో అలో అలో.....
ఈనాటి టీవీ భాగవతంలోని కలిపురుషుడు, మరి అప్పటి రాజాధిరాజు సినిమాలోని మైదాస్పాత్రలు ఒకే మూసలోనివి. అయితే, భాగవతంలో హాస్యానికి అంతగా ఆపర్చూనిటీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చే వసంతకుడో లేదా ప్రహ్లాదుని గురువులైన చండమార్కుల మార్కు పాత్రలద్వారా కొద్దో గొప్పో హాస్యాన్ని గుప్పించవచ్చు. ఇది ముఖ్య పాత్రల ఔచిత్యానికి, కథన గాంభీర్యానికి భంగం రాకుండా బాపూ రమాణలు చెప్పగలరనటానికి డౌటే లేదు. మనవాళ్ళకు హాస్యమెంత ముఖ్యమో భాగవత కథలకి శృంగారాద్భుత రసాలంత ముఖ్యం. అంటే నవరసాలలో మిగిలినవి లేవని కాదు. నరసింహావతారంలోని రౌద్రం, భీభత్సం, రామావతారంలోని వీరం, కరుణ, ఇలా అన్ని రసాలు కలిసినదే ఈ కథనం. అయితే భక్తి నిరూపణకి ముఖ్యమైన ముడిసరుకులు శృంగారమూ మరియూ అద్భుతమునూ.
శృంగార రసం ఎలా? 
ఎంతటి రసికుడవో తెలిసెరా...
భారతీయ పురాతన సాంప్రదాయంలో శృంగారము, ఒక చెప్పదగని గోప్యమయిన విషయమేమీ కాదు. అయితే, ఆధునిక సభ్య సంస్కృతికి పునాది, విక్టోరియా యుగానికి చెందిన పాశ్చాత్యపు విలువలు. అప్పటి సాహిత్యంలోని శృంగారాన్ని మక్కికిమక్కిగా చూపిస్తే నేటి సమాజం దాన్ని అశ్లీలం అనే ప్రమాదం ఉంది. మరి చూపించక దాస్తే అది సాంప్రదాయానికి న్యాయం చేసినట్లు కాదు. ఈ కత్తిమీద సాము బాపుగారికి అలవాటే. బంగారు పిచ్చుకసినిమాలో హీరోని విజయనిర్మల గారు సెడ్యూస్ చేయబోయే సన్నివేశంలో వీరు చూపించిన శృంగారం, మేల్ ఆడియెన్స్ లోని బేసిక్ ఇంస్టింక్ట్ ని కదిలించినా, అది అసభ్యం అశ్లీలం అని ఎవ్వరూ అనలేరు. జయమాలిని, హలంలు శివశివ అననేలరాలేదా ఎంతటి రసికుడవో తెలిసెరాఅని ఆడిపాడినా అది కథనానికి రసపట్టయిందే కానీ, వసూళ్ళకోసం జొప్పించిన ఐటమ్ నంబర్లు కాలేదు. కాబట్టి భాగవతంలోని మేనక, మోహినిలాంటి పాత్రలు డ్రాయింగ్ రూంలో మిగిలిన కుటుంబ సభ్యులతో చూడడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు.
టెక్నాలజీ - అద్భుతం
బాపూ సినిమాల్లో అద్భుత రసానికి ఆయువుపట్టు రవికాంత్ నగాయిచ్ గారి కెమెరా ట్రిక్స్. ట్రెడిషనల్ ఇమేజరీలోని అవాస్తవిక దృశ్యాల్ని తెలుగు సంప్రదాయానికి ఎంతో దగ్గరగా చూపించగలగడం ఆయన గొప్పదనం. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో సహా అందరూ ఉపయోగిస్తున్నది వీడియో ఆనిమేషన్ టెక్నాలజీ. ఇప్పటి సినిమాలలో చూపిస్తున్న ట్రిక్స్ చాలావరకూ కంప్యూటర్ ద్వారా వీడియో మీడియంలో తీసి రివర్స్ టెలెసినిద్వారా సినిమా ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయి. మన దేశంలో ప్రస్తుతం వీడియో ఆనిమేషన్ టెక్నాలజీని మాస్టర్ చేసిన టెక్నీషియన్లు చాలామందే ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని మాయ ఇటువంటి ఒక అధునాతన వసతి. ఈ మాయాజాలం భాగవత నిర్మాణంలో బాపుగారికి మంచి కైజోడవుతుంది.
సినిమా - టెలివిజన్
ఒక టెక్నాలజీ విషయంలోనే కాదు. భాగవతానికి సినిమాకంటే టెలివిజన్ సరైన మీడియం అనుకుంటాను. ఎందుకంటే ఇది భారత రామాయణాలలోలాగా ఒక కథ కాదు, ఎన్నో కథల సంకలనం. ఒక్కొక్క కథనీ సినిమాగా తీస్తూపోతే కనీసం ఇరవై సినిమాలన్నా పడుతుంది. ఒకే మూడు గంటల సినిమాగా కండెన్స్ చేస్తే, ఒక్కొక్క కథనీ క్లుప్తంగా కట్టెకొట్టేతెచ్చెఅన్నట్లుగా చూపించాల్సి వస్తుంది. బాపుగారు ఈ ఎక్స్పరిమెంట్ కూడా చేసారు. సీతాకళ్యాణంసినిమాలో శ్రీరామ జననం నుంచి కళ్యాణం వరకూ ప్రధాన కథ అయితే, అందులో భాగవతంలోని ఐదు ముఖ్యమైన కథలను, పది పదిహేను నిమిషాల పాటల ద్వారా క్లుప్తంగా చూపించారు. గంగావతరణం, త్రిపురాసుర సంహారం, వామన, ప్రహ్లాద, విశ్వామిత్ర చరిత్రలు చూడడానికి, వినడానికి ఎంతో సొంపుగా మలచారు. అమెరికన్ యూనివర్సిటీలలో ఓరియెంటల్ ఆర్ట్స్ సిలబస్ లో భాగంగా నిలిచే గౌరవం దక్కించికున్న ఈ చిత్రం, ఇక్కడ బాక్సాఫీస్ లో ఫ్లాప్ అయింది. నా దృష్టిలో కారణం ఏమిటంటే, ప్రేక్షకులలో పురాణేతిహాసాలలోని న్యూన్సే ఆకళింపు చేసుకోగలవారు చాలా కొద్దిమంది. ఈ కోవకి చెందిన వారికి ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. మిగిలిన వారికివి పూర్తిగా అర్థమవాలంటే కొంచెం ఎలాబొరేషన్ అవసరం. నెరెటివ్ ద్వారా లేదా సంభాషణల రూపంలో ఈ కథలు మామూలు ప్రేక్షకులకి అర్థమయేలా చెప్పాలంటే ఒక్కొక్క కథకి కనీసం ఒకటి రెండు గంటలైనా పడుతుంది. అంటే, ఇరవై ముప్ఫై సినిమాల నిడివి పట్టే భాగవతం ఏభై ఎపిసోడ్ ల సీరియల్ కి సరిగ్గా సరిపోతుంది. ఒక సంవత్సరం పాటూ ప్రతి ఆదివారం చూస్తేగానీ ఈ భాగవతం తెమలదు.
ఈ కాలంలో మనవి చాలావరకూ న్యూక్లియర్ కుటుంబాలు. ఎడ్యుకేషన్, లిటరసీ పెరిగినా, సంప్రదాయక సాహిత్యంలో జ్ఞానం బాగా తగ్గింది. మన ఇండ్లలో పిల్లలకి మైథలాజికల్ కథలు చెప్పగల సామర్థ్యం, సమయంగల పెద్దలు కరువైయ్యారు. అందుకే ఈటీవీ భాగవతాన్ని మనమొక ఆపర్చ్యూనిటీగా భావిస్తే పోతనామాత్యుడు మనింట నాటిన కల్పవృక్షపు మహాఫలాల్ని మరికొన్ని తరాలు తినవచ్చు.

- సాయి పాపినేని, రీజనల్ మేనేజర్ మార్కెటింగ్,
యు. బి. గ్రూప్, స్పిరిట్స్ డివిజన్

---

1 comment:

  1. Great stuff Sai... thank you for posting it on the blog....more can reach

    Srini _ HYD

    ReplyDelete