Search This Blog

Thursday, November 28, 2013

Aa Roju - Short Story



ఆ రోజు
పాతికేళ్ళ క్రిందట, నవంబర్ నెలలో ఒకరోజు :
ఆఫీసర్స్ క్లబ్‌లో రెండు సెట్లు టెన్నీస్ ఆడినా ఏమాత్రమూ అలసట అనిపించలేదు. ఆకాశం మబ్బులు కమ్మి ఉంది. ఉదయం ఎనిమిది గంటలైనా ఇంకా ఎండ ఛాయలేదు. చల్లనిగాలి. ఆహ్లాదకరమైన వాతావరణం. ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ, కాలుమీద కాలు మడుచుకుని క్లబ్‌బాయ్ వెంకటేశ్వర్లు ఇచ్చిన కాఫీ కప్పు ఒకచేత్తో అందుకున్నాడు డేవిడ్‌రాజు. టీపాయ్ మీదున్న గోల్డ్‌ఫ్లేక్ ప్యాకెట్టూ, అగ్గిపెట్టే అందుకుని "ఏం సార్, ఇంకో ఆట ఆడదామా?" అంటూ సిగరెట్ వెలిగించి ఆకాశం వంక చూస్తూ గుప్పుగుప్పుమని పొగ వదలసాగాడు.
పట్ణాయక్ కుర్రాడు. జన్మస్థలం ఒరిస్సాలోని బరంపురం. ఐఏఎస్ శిక్షణ పూర్తయి ఆ సంవత్సరమే అసిస్టెంట్ కలెక్టర్‌గా గుంటూరు వచ్చాడు. అదే మొదటి పోస్టింగ్. టెన్నీస్ రాకెట్‌ని కవర్లోకి తోస్తూ,
"మీకేం సార్, కాలేజీకి సెలవు ... ఒకవేళ ఉన్నా అడిగేవాళ్ళు లేరు. పేరుకి  మేము అయ్యేయెస్సే కానీ ఎవరు పిలిచినా అయ్యా యెస్స్అంటూ పరిగెత్తాలి. ప్రొద్దున్నే తొమ్మిదింటికి అత్యవసరంగా మీటింగ్‌కి పిలిచాడు, మా బాస్ ... ఏమి ముంచుకొచ్చిందో?" అని జవాబిచ్చాడు, పట్ణాయక్. అతడన్న మాట ఆ రాత్రికే నిజమౌతుందని అప్పుడు ఎరగడు.
"ఏమిటో అంత ఎమర్జెన్సీ?"
"ఏమీలేదండీ, ఈ నవంబర్‌లో కాస్త ముసురుపడితే చాలు, కలెక్టరాఫీస్‌లో ఉరుములూ మెరుపులూ. ప్రపంచం అంతమైపోతుందేమో అన్నట్లు, హడావుడి. అంతా ఆ దివిసీమ తుఫాను ఎఫెక్ట్. దానికి తోడు ప్రతి అరగంటకీ వాయుగుండం గురించి హెచ్చరికలు. ఉత్త సింగినాదం ... జీలకర్ర సామెతలాగా."
"అలా అంటే ఎలా సార్? మనం అప్రమత్తంగా ఉంటే అలానే అనుకుంటాం సరే, కానీ ప్రతిసారీ, వానపడినప్పుడల్లా మేము పరుగులుపెట్టి, లోతట్టు ప్రాంతాల జనాల్ని తరలించడం ... తరువాత ఆ తుఫానేమో తుస్సుమని పోవడం, ప్రజలు కూడా పట్టించుకోవడంలేదు. నాన్నా పులి అంటే నమ్మనుపో అంటున్నారు, హుహ్." అని నిట్టూర్చాడు, పట్ణాయక్.
"అందుకని, మరో తుఫాను రావలనుకోవాలా? భలేవారు సార్! మీరన్నట్లు ఈ తుఫాను తుస్సుమంటేనే మంచిది ... రేపుదయం ఆరుగంటలకి, యాజూజ్వల్ రెండు ఆటలు, ... ఒకవేళ వానపడితే, బ్యాడ్మింటన్, ఏమంటారు? అరే ... ఇవాళ వైజాగ్‌లో రంజీట్రాఫీ మ్యాచ్ ఉంది. ఆంధ్రా వర్సెస్ హైదరాబాద్. ఈ మ్యాచిగనుక గెలిస్తే చాలాయేళ్ళ తరువాత మనవాళ్ళు సౌత్‌జోన్‌కి క్వాలిఫై అవవచ్చు. అదే వర్షంవచ్చి వాషవుట్ అయితే, మనవాళ్ళ పని అంతే. రేడియోలో కామెంటరీ మొదలవడానికి ఇంకా గంటన్నర ఉంది. కాసేపు ఇక్కడే రిలాక్స్ అయితే మన క్యాంటీన్ వాడు పెట్టే ఉప్మా తిని వెళ్ళొచ్చు." అని పేము కుర్చీలో జారగిలబడ్డాడు, రాజు.
"సరే పదండి. అదేదో బ్రేక్ఫాస్ట్ కానిచ్చే వెళతాను", అని మార్కర్ వంక తిరిగి, "ఇస్మాయిల్ ... క్లబ్‌హౌసులోకెళ్ళి వెంకటేశ్వర్లుకి టిఫిన్ రెడీ చెయ్యమని చెప్పు", అని బ్యాగులోని టర్కీటవలుతో ముఖంపైన లేని చెమటని తుడుచుకోవడంలో నిమగ్నుడైయ్యాడు, పట్ణాయక్.
"థాంక్స్ ఫర్ ద కంపనీ ... అటు కాలేజీకి సెలవు, ఇటు మా చిన్నోడు ఊళ్ళో లేడు, అస్సలు టైమ్ గడవడం లేదు", అని నిట్టూరుస్తూ, మరో సిగరెట్టు వెలిగించాడు, రాజు.
"అదేం సార్, సెలవులకి మీరూ కూడా ...?" అనాలోచితంగా వేసిన ప్రశ్నకి రాజు ముఖంలో మారిన రంగులని గుర్తించి అంతలోనే ఆపేసాడు.
"హెహె ... " అని కాసేపట్లో తేరుకుని, "అక్కడికి వెళితే ఈ టెన్నీసూ, మీవంటి వారి సాహచర్యం దొరకదు కదా", అని దాటవేస్తూ, "పదండి టిఫిన్ చేద్దాం, అయినా ఇంకెంతకాలం. ఇవాళ్టితో సరి. మద్యాహ్నం క్రిష్ణా ఎక్స్‌ప్రెస్‌కి వచ్చేస్తుంది", అని క్లబ్ లోనికి దారితీసాడు.
---
"ఇవాళ స్పెషల్, ఎమ్మెల్యే పెసరట్టు సార్", అని రెండు ప్లేట్లలో వేడి వేడిగా నేతి వాసనతో ఘుమఘుమలాడే ఉప్మా-పెసరట్లు వాళ్ళ ముందు పెట్టాడు, వెంకటేశ్వర్లు.
"ఏమిట్రా ఇవాళ విశేషం?" అడిగాడు రాజు.
"ఏమీలేదు సార్. ఇవాళ మాలతీ మేడం తిరిగి వస్తున్నారు కదా ... ఇక మిమ్మల్ని క్యాంటిన్‌లో చూసేదే కష్టం", అంటూ నవ్వాడు, వెంకటేశ్వర్లు. డేవిడ్‌రాజు అంటే క్లబ్బులో అందరికీ హీరో వర్షిప్. అతడు అన్ని ఆటలలో మేటి. టెన్నీస్, షటిల్ బ్యాడ్మింటన్లలోనే కాదు, కాంట్రాక్ట్ బ్రిడ్జిలోనూ స్టేట్ ఛాంపియన్. ఏ ఆటలోనైనా సరే, గుంటూరులో అతనిని కొట్టేవాళ్ళు లేరు. మేనిఛాయ నలుపైనా, ఆరడుగుల ఆజానుబాహువుడూ, స్ఫురద్రూపి.
పట్ణాయక్ తలెత్తి చూసాడు. ముఖంలో అతడు అంతకుముందు వేసిన ప్రశ్న ప్రస్ఫుటంగా కనిపించింది. గమనించిన రాజు ఒక నిశ్చయానికి వస్తూ తలాడించాడు. "ఇందాక ... నేను సెలవులకి మా ఆవిడతో ఊరికి ఎందుకు వెళ్ళలేదూ అనికదా మీరడిగారు? చెబుతా వినండి..." అని మొదలెట్టాడు, రాజు.
---
"నేను మాలతిని మొదటిసారి పదేళ్ళ క్రితం కలిసాను. జాతీయ క్రీడలకి తనూ బెంగుళూర్ వచ్చింది. స్టేట్ టెన్నీస్ జట్టులో తను కూడా ఉంది. తరువాత నేను గాంధీ మెడికల్ కాలేజీలో పీ.జీ. చేసేటప్పుడు మా పరిచయం గట్టిపడింది. మాలతి కూడా అదే కాలేజీలో మెడిసిన్ చదువుతూ ఉండింది, థర్డియర్. ఇద్దరికీ క్రీడలంటే అభిమానం. తనతో టెన్నీస్ ప్రాక్టీస్ చేసేందుకు నేను తప్ప వేరే లేరు. అప్పటికే తను ఇండియా నంబర్ త్రీ."
"సో... ఆవిధంగా టెన్నీస్‌కోర్ట్‌లో రోమాన్స్? బాగుందండీ", అంటూ నవ్వాడు పట్ణాయక్.
"నో నో ... అలాంటిదేమీ లేదండీ. వీ వర్ జస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికీ ఆట తప్ప వేరే ధ్యాస లేదు. అయినా తనకీ నాకూ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ... మీకు తెలుసు, నేను ప్రభుత్వం ఖర్చుతో ఫ్రీ ఎడ్యుకేషన్ పుణ్యమా అని హాస్టళ్ళలో ఉంటూ చదువు సాగించాను. తనేమో దొరలబిడ్డ, రాజకుమార్తెలా పెరిగింది."
"ఓహ్, అయామ్ సారీ"
"పరవాలేదు సార్", అని పెదవి విరుస్తూ, "మీలాగే చాలామంది మా మధ్య ఏదో నడుస్తుందని అనుకునేవాళ్ళు. మాలతి నాన్నగారిది ఖమ్మంమెట్టు. వాళ్ళనోటా వీళ్ళనోటా పడి మామీద పుట్టిన పుకార్లు ఆ ఊరు చేరనే చేరాయి. దమ్మిడీకి తూగని మాల కుర్రాడు రాజావారి అమ్మాయికి వలపన్నడం కొంతమందికి మింగుడు పడలేదు. ఒకరోజు హాస్టల్ బయట వాళ్ళు కొట్టిన దెబ్బలకి ... ఆటలాడిన శరీరం కాబట్టి తట్టుకుంది. బ్రతికి బయటపడ్డాను కానీ ... ఆయేడు ఇండియాకి డేవిస్‌కప్ ఆడతాననుకున్న నా కల కలగానే మిగిలిపోయింది."
"మరి మీ వివాహం?"
"హుమ్...! అదే చిత్రం. అంతవరకూ నాపై ఎటువంటి ఉద్దేశ్యమూ లేని మాలతి, ఇంట్లోవాళ్ళతో గొడవపడింది. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టుబట్టింది. ఎంతమంది చెప్పినా ససేమిరా. నేను కూడా మొదట్లో నచ్చజెప్పబోయాను. కానీ కొన్నాళ్ళకి ఆమె మొండి పట్టులో నామీద ప్రేమ కనిపించింది. అలా మెత్తబడి ఇలా దొరికిపోయాను, హ హహ్", అన్నాడు రాజు, లేని నవ్వు తెచ్చుకుంటూ.
"అంటే... ఆఖరికి వాళ్ళకి ఒప్పుకోక తప్పలేదన్నమాట?"
"ఒప్పుకోవడమా? ... ఇంకా నయం. ఐదేళ్ళు మాటలు లేవు. అదిగాక లేనిపోని బెదిరింపులు. నాకు ఈ మెడికల్ కాలేజ్‌లో పోస్టింగూ, తనకూ ఇక్కడే అమెరికన్ హాస్పిటల్లో రెసిడెంట్‌గా ఉద్యోగం రావడం ... స్పోర్ట్స్ పుణ్యమా అని మీలాంటి అధికారులతో సహవాసంవల్ల ఏ భయమూ లేకుండా నెట్టుకొచ్చాం. చిన్నోడు సిద్ధార్థ పుట్టేవరకూ, నాకు మాలతీ, తనకు ఈ మాలవాడూ తప్ప వేరే లోకం లేదు. అఫ్కోర్స్, ఇప్పుడు మా ఇద్దరికీ సిద్ధార్థ. వాడు పుట్టాకే మళ్ళీ వాళ్ళతో ఏదో కాస్త పలకరింపులు. ఎంతైనా ఒక్కగానొక్క కూతురిమీద మమకారం, మనవడిని చూడాలనే తాపత్రయం. కానీ ఈ మాలవాడిని మాత్రం అల్లుడిగా అంగీకరించలేరు. మొదట్లో మాలతి వెళ్ళనంది, కానీ నేనే నచ్చచెప్పాను", అని తలెత్తి పట్ణాయక్ వంక, ఇప్పుడు అర్థమయిందా నేనెందుకు వెళ్ళలేదో అన్నట్లు చూసాడు, రాజు.
---
పాత లాంబ్రెట్టా స్కూటరు, సైడ్‌కార్లో సామాను పెట్టి రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరింది ఆ చిన్న ఫ్యామిలీ. స్కూటర్ వెనుక కూర్చుంటూ, జోరుగా వీస్తున్న ఈదురుగాలికి లేచిన దుమ్ము కళ్ళలో పడకుండా చీరెచెంగుతో ముఖాన్ని కప్పుకుని, "వాణ్ణిలా ఇవ్వండి. కళ్ళలో ఏమైనా పడుతుంది", అన్నది మాలతి.
"ఊహూ ... నేను లాను. డ్యాడీ వొ్ల్లోనే కూచుంటా", అని మొండికేసాడు రెండేళ్ళ సిద్దూ.
"ఎంతో దూరం లేదులేవోయ్, పద వర్షం పడేలోగా ఇంటికి పోదాం", అన్నాడు రాజు.
"ఏదో పెద్ద వానే పడేట్లుంది. పండగ వెళ్ళినా ఇంకా ముసురు వదలలేదు. దారిలో శంకర్‌విలాస్ వైపు కాస్త పోనీయండి. పిల్లోడికి పాలూ, రాత్రి వంటకి సామాన్లూ తీసుకుందాం"
"ఆ మాత్రం నాకూ తెలుసులేవోయ్. అన్నీ ప్రొద్దున్నే తెచ్చి ఇంట్లో పెట్టాను. రాణీగారు ఇంటికి వస్తే చాలు, మనకి గడపదాటి బయటకెళ్ళే పనిలేదు", అని స్కూటర్‌ని నాజ్‌సెంటర్ వైపు తిప్పాడు. గాలి మరీ తీవ్రంగా ఉంది. మద్యాహ్నం మూడు గంటలకే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అటూ ఇటూ చెట్లు పూనకం వచ్చినట్లు ఊగుతున్నాయి. వానైతే ఇంకాలేదు. జాగ్రత్తగా ఇంటివైపు నడిపించాడు.
అమెరికన్ హాస్పిటల్లో డాక్టర్స్ క్వార్టర్స్. చుట్టూ పదడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్. "తాతయ్య ఇంటికంటే మనిల్లే పెద్దది, డ్యాడీ", గట్టిగా అరిచిచెప్పాడు, సిద్దూ. ఈదురుగాలి చేస్తున్న శబ్దానికి ఏదీ వినిపించడం లేదు. ఇనుప రేకుతో కోటద్వారాన్ని తలపించే నిలువెత్తు గేటుపై దబదబా బాదాడు, రాజు. పరుగెత్తుకొచ్చిన వాచ్‌మన్ గడ తీయగానే, గాలి విసురుకి గేటు రయ్యని తెరుచుకొని స్కూటర్‌ని తాకింది. సైడ్‌కార్ ఉండడం మంచిదయింది, లేకుంటే ఆ తాకిడికి క్రిందపడి ఉండేది. లోపలికి వెళ్ళాక మళ్ళీ అదే గేటు మూయడానికి ఇద్దరు మనుషులు కలిసి లాగినా కష్టమయింది. ఆఖరికి వాచ్‌మన్ని బయటనుంచి తోయమని, రాజు తన బలాన్నంతా ఉపయోగిండంతో ఎలాగోలా అది మూసి గడియవేయడం సాధ్యమయింది. వాచ్‌మన్ని ఇక ఇంటికి పొమ్మని చెప్పి, ఆకాశాన్నంటే చెట్ల మధ్య సన్నని రోడ్డులో విరిగి క్రిందపడిన కొమ్మలను తప్పిస్తూ జాగ్రత్తగా స్కూటర్ నడిపించి, బంగళాకి చేరిన వెంటనే వర్షం ఆరంభమయింది.
---
కరెంటు లేదు. కొవ్వత్తుల వెలుగులో వంట పూర్తిచేసి, బయట చెట్లు విరిగి పడుతున్న శబ్దానికి ఉలికిపడుతున్న సిద్ధార్థని నిద్రబుచ్చి పడక చేరారు, దంపతులిద్దరూ. మూడు వారాల తరువాత భార్య సాంగత్యం, బయట ప్రకృతి చేస్తున్న విలయతాండవం కూడా అతడికి ఎటువంటి అంతరాయం కలిగించలేదు.
సొలసిపోయి కలలోకి జారుకున్నాడు...
...... సముద్రపు హోరు. అలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. చెట్టపట్టాలు వేసుకుని తనూ మాలతీ తీరంవెంట పరిగెడుతున్నారు. అది వైజాగ్ రామక్రిష్ణా బీచ్ అనుకుంటా... అంతలోనే రూపు మారిపోయింది. బీచ్ అంతా నిర్మానుష్యం. దూరంగా ఒంటరిగా సిద్దూ. డ్యాడీ... అని అరుస్తున్నాడు. అలల పోటుకి వాడి అరుపులేమీ వినబడటం లేదు. అంతలో ఒక పెద్ద అల వాడి వైపే... పరుగెడదామంటే కాళ్ళు ఇసుకలో కూరుకుపోతున్నాయి. బోర్లా పడిపోయాడు. సీసం వేసినట్లు కాళ్ళూ చేతులూ కదలడంలేదు. అంతలో సముద్రపు అల ... ఒళ్ళంతా తడిచిపోయింది.
సిద్దూ ....
ఒక్క ఉదుటున నిద్రలేచాడు, రాజు.
చెవులనిండా సముద్రపు హోరు, ఏమాత్రమూ తగ్గలేదు. ప్రక్కన హాయిగా నిద్రిస్తున్న మాలతి. కిటికి అద్దంలోంచి ఏదో అసహజమైన ఎర్రని వెలుతురు.
తడి... పరుపెందుకు తడిచింది? సిద్దూ కోసం చేతులతోనే గాలించాడు ... లేడు. వాడి ఉయ్యాల తొట్టి...?
మంచంపైనుంఛి తటాలున లేచాడు. కాళ్ళు నేలకానలేదు... నీళ్ళు!
మోకాళ్ళవరకూ నీళ్ళు, మంచం చుట్టూ...
"మాలూ...." అని కేకవేసి సిద్దూ పడుకున్న ఉయ్యాల తొట్టివైపు కదిలాడు. ఇల్లంతా మోకాలిలోతు నీళ్ళు. నిద్రపోతున్న కొడుకుని చేతులలోకి తీసుకుని భుజాన్న వేసుకున్నాడు. హటాత్తుగా లేవడంతో ఏమయిందో తోచక గుక్కపెట్టి ఏడవసాగాడు, సిద్దూ. 
భర్త కేకకి ఉలిక్కిపడి లేచి చీకట్లో ఏమీ అర్థంకాక అయోమయంగా కూర్చున్న మాలతికి "ఆగు... నీళ్ళు... కదలకు, ఇల్లంతా నీళ్ళు" అన్న  రాజు అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి.
గుక్కపెట్టి ఏడుస్తున్న కొడుకుని ఆమె ఒళ్ళో పెట్టి, "వీణ్ణి సముదాయించు. కదలకుండా ఇక్కడే కూర్చో, నేనెళ్ళి చూస్తాను", అని కిటికీవైపు కదిలాడు.
మాలతికి పరిస్థితి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. తల్లి వడి చేరగానే సిద్దూ కూడా కాస్త స్థిమితపడ్డాడు. "క్యాండిల్స్ బల్లమీద ఉన్నాయ్" అని చీకట్లోకే కేకేసింది.
కిటికీ దగ్గర బల్లమీద తడిమితే, కొవ్వత్తి దొరికింది. అగ్గిపెట్టె మాత్రం తేమకి తడిచిపోయింది. అలాగే గోడవెంబడి తడుముకుంటూ, కొక్కానికి వ్రేలాడుతున్న ప్యాంటు పాకెట్లోంచి అగ్గిపెట్టె తీసి వెలిగించాడు.
కొవ్వత్తి వెలుగులో వాళ్ళున్న స్థితి కొంచెం కొంచెంగా అవగతమవసాగింది. కిటికీ బయట చూస్తే దృశ్యమంతా క్రొత్తగా ఉంది. ఎప్పుడూ ఎదురుగా కనిపించే వేపచెట్టు అదృశ్యమయింది. ఆవరణ అంతా జలమయం. ఎత్తైన కాంపౌడ్ వాల్ కదా ... నీరు బయటకు వెళ్ళేందుకు తావులేదు. గేటు వేయకుండా ఉండాల్సింది ... తన ఇల్లు సముద్రం మధ్యలో ఓడలాగ...
పడక పైకి నీళ్ళు రాసాగాయి. అంతలోనే నీటి మట్టం అరడుగు పెరిగింది. తలుపు సందులలోంచి నీళ్ళు తన్నుకుంటూ వస్తున్నాయి. బయట నీటిమట్టం ఇంట్లోకంటే ఒకడుగు పైకే ఉంది.
ఇంట్లోంచి బయటకెళ్ళడం అసాధ్యం. టెలిఫోన్ మధ్యాహ్నం నుంచే పనిచేయడంలేదు. హాస్పిటల్ బ్లాకు కనీసం రెండొందల మీటర్లు ఉంటుంది. కాంపౌండ్ అంతా నీరు నిండిపోయింది.
నిమిషనిమిషానికీ నీళ్ళు లోనికి వచ్చేస్తున్నాయి. పిల్లాడిని ఎత్తుకుని, బిక్కమొహంతో మంచంమీద నిలుచుని ఉండిపోయింది, మాలతి. మంచమయితే పూర్తిగా మునిగిపోయింది. ఎటు చూసినా గజంలోతు నీళ్ళు.
ఏంచేయాలి...? 
మెల్లిగా బల్లని మంచంవైపు లాగాడు. బలమంతా ఉపయోగించి దానిని ఎత్తి మంచంపైన నిలబెట్టాడు. భార్యని దానిమీద కూర్చోబెట్టి తరువాత ఏంచేయాలో ఆలోచించసాగాడు.
భళ్ళుమని కిటికీ తలుపు పగిలిపోయింది. ఒక్కసారిగా నీటి మట్టం అతడి ఛాతీవరకూ వచ్చేసింది. కొవ్వొత్తి ఆరిపోయింది. లాల్చీ జేబులోని అగ్గిపెట్టె ఇక పనికిరాదు. కాంపౌడులో పురుగూ పుట్రా ఈ నీళ్ళతోపాటూ ఇంట్లోకి వస్తే ...? ఆ ఆలోచన అతని గుండె ఝల్లుమనిపించింది.
మంచం పైన నిలుచున్నాడు. చెత్తా ఆకులూ, ఇంట్లో సామాన్లూ నీళ్ళమీద తేలుతున్నాయి.
అదృష్టమేమో ... వాటితోపాటూ తేలుతున్న చెక్క కుర్చీ.
---
ఒకచేత్తో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన సిద్దూని భుజానికి హత్తుకుని, రెండో చేత్తో వెంటిలేటర్ కమ్మీని ఒడిసి పట్టుకున్నాడు. అతని మెడచుట్టూ చేతులు బిగించి వ్రేలాడుతున్న మాలతి బరువు కూడా ఆ చేతిమీదే. క్రింద పదడుగుల లోతు నీళ్ళు.
అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు.
చేయి మార్చేందుకు కూడా వీలులేదు. శరీరంలోని ప్రతి అణువులోని శక్తినీ తన కుడిచేతిలో కేంద్రీకరించాడు.
కాంపౌడ్ వాల్ ఎత్తు సుమారుగా పదడుగులు ఉండవచ్చు. దానికి మించి నీటిమట్టం పెరిగేందుకు ఆస్కారం లేదు. కానీ ఇలా ఎంతసేపు ఉండగలడు? మాలతి చేతులలోనూ శక్తి సన్నగిల్లసాగింది. ఒకసారి పట్టు సడలితే ... తన మాలతి తనకిక దక్కదేమో?
ఆమెని పట్టుకోవాలంటే ... చేతిలో సిద్దూ ... కళ్ళలో నీళ్ళు ఉబికాయి.
మాలతి కావాలంటే ... సిద్దూని వదులుకోవాలా?
తన మాలతి ఉంటే భవిష్యత్తులో మళ్ళీ పిల్లల్ని కనొచ్చు ... కానీ ఆమే కనుక లేకపోతే...? అంటే...
సిద్దూని ... తన ప్రాణానికి ప్రాణాన్ని... వాడి భవిష్యత్తు గురించి కన్న కలలని ... వదులుకోవాల్సిందేనా...? మాలతిని దక్కించుకోవాలంటే వేరే గత్యంతరం లేదా?
ఆ ఆలోచన అతడిని అశనిపాతంలా తాకింది. గుండెను ఎవరో పిండినట్లు...
ఓ జీసస్...
గొంతు పెగలకపోయినా ... అది హృదయపు లోతులలోంచి పెల్లుబికిన ఆక్రందన!
ఎక్కడో దూరంగా పెళపెళమనే శబ్దం. ఏదో భళ్ళున పగిలినట్లు ...
ఆనకట్టకి గండిపడినట్లు, కనులుమూసి తెరిచేంతలో నీటి మట్టం తగ్గిపోయింది.
---

ప్రస్తుతం :
ఇండియా వర్సెస్ స్పెయిన్ ... డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ మ్యాచ్ టీవీలో వస్తుంది. డబుల్స్ మ్యాచ్, మూడవ సెట్.
స్కోర్ 5 : 4, 40 : 15.
సిద్ధార్థ్ రాజు సర్విస్. 
ఏస్!
ఒక చిన్న భారతీయ దర్శకుల దళం కరతాళద్వనులు తప్ప స్టేడియం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
"అది ఉక్కుతో చేసిన చేయి. ఆ బలం అసామాన్యం!" కామెంటేటర్  మాత్రం భారతీయుడే.
ఆరోజు... ఆ క్షణంలో... కాంపౌండ్ వాల్ పడిపోకుంటే ...?’ అన్న ఆలోచన తప్ప డేవిడ్‌రాజు మనసులో వేరే ఇంకేమీ లేదు. దుఃఖం ఎగదన్నగా భార్య వడిలో తలపెట్టి అలానే ఉండిపోయాడు.
---