పగలూ ... రాత్రీ ...
ఐదారేళ్ళ క్రితం అనుకుంటా ... కోరమంగళా క్లబ్బు పార్కింగ్ లాట్లో జాగాలేదు. ‘రోజూ ఇదే తొందర’ అని వాచ్మన్ మీద విసుక్కుంటూ ఎలాగోలా మారుతీ కారుని రెండు పెద్ద బండ్లమధ్య ఇరికించి హడావిడిగా
బార్ కౌంటర్ వైపు నడిచాను. ఆల్రెడీ ఎయిట్ ‘తర్స్టీ’ ... సాయంకాలం దాహం తీర్చుకునే టైమ్. రెడ్డిగారు మామూలుగానే కార్నర్లో ఉన్న
బార్ స్టూల్ పైన చేతిలోని మెక్డోవెల్ బ్రాందీ గ్లాసువంక దీర్ఘంగా చూస్తూ కూర్చొని ఉన్నాడు.
ఆతడిని పలకరించడం సుద్ద వేస్టు. రాత్రి పదింటికి మూడవ పెగ్గు పడ్డాకే అతడి నోరు పెగుల్తుంది.
ఇద్దరమూ ఆ కౌంటర్ వద్ద రెగ్యులర్ కస్టమర్లమే. అక్కడ ఎంతోమంది కూర్చోరు. లాన్ టేబుల్సూ, ఏసీ బారూ మాత్రం బిజీగా ఉంటాయి. రోజూ ఒకేచోట కూర్చుంటున్నా మేమిద్దరం
ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకున్నది చాలా అరుదు. కానీ ఆరోజు నేను లేటుగా రావడం,
రెడ్డిగారి రెండో పెగ్గు కాస్త త్వరగా పూర్తిచేయడంతో బాతాఖానీలో పడక
తప్పలేదు.
"ఏమప్పా రోజూ ఈడనే సూస్తూ ఉండానూ ... ఏడా కల్సా?" అంటూ రెడ్డిగారే సంభాషణ మొదలెట్టాడు.
"ఇక్కడే సార్, ఆర్కియాలజీ సర్వేలో సూపర్నెంట్" జవాబిచ్చాను.
"అయ్యో అట్లాంగా? అంటే హిస్టరీ ఎమ్యే అసంటిదేదో సేసి ఉండుణ్టావ్",
అని చప్పరించాడు. "ఈ కాలంలో మంచిగా ఏ డాక్టరో, ఇంజనీరో చదువకుంటే ఏదీ లాభం ఉండేదిలే".
నాకు కాస్త చిరాకేసినా, ఏదో పెద్దముండాకొడుకులే అని నిదానించుకుని,
"ఎమ్యే మాత్రమే కాదులేండి సార్, ఆర్కియాలజీలో
పీహెచ్డీ కూడా చేసాను ... ఏదో కాస్త పరవాలేదు లేండి", అని
నన్ను నేనే సమాధానపెట్టుకుంటూ జవాబిచ్చాను.
"ఐనా వేస్ట్. చూడ్డానికి తెలివుండా లైఫంతా వేస్ట్ సేసుణ్డావ్ గాదప్పా?" అంటూ చేతిలోని గ్లాసుని కౌంటరుమీద మోదడంతో ‘అది అతడి మూడో
పెగ్గు మాత్రమే కాదేమో’ అన్న అనుమానం వచ్చింది. "మా సిన్నోడు సూడు ... ఆర్యీసీ
సూరత్కల్లులో మెరిట్ సీటు వచ్చుండాది. ఇందాన్కనే ఫోన్ సేసిణ్డాడు", గ్లాసు ఎత్తి దానిలోని బ్రాందీని ఒక్క గుక్కలో గొంతులో పోసుకుని, బార్మన్తో "షెట్టరే... వన్ మోర్ రిపీట్" అని నావంక చూస్తూ, "నీదేమప్పా డ్రింకు? టుడే ఆల్ సెలెబ్రేషన్స్,
వన్ మోర్?"
"థాంక్యూ సార్, కంగ్రాట్స్" అంటూ షెట్టీ అందించిన రాయల్
ఛాలెంజ్ అందుకున్నాను, ఫ్రీ డ్రింకు ఎందుకు కాదనాలి?
"సో ... మీరేమి చేస్తారు సార్?" ఏదో
ఫార్మాలిటీగా అడిగాను. దానితో మొదలయింది, గంటన్నరసేపు ఏకధాటిగా
అతడి జీవితచరిత్ర అంతా ... బెంగుళూరు ప్రక్కనే ఆనెకల్లులో పుట్టి, మైసూరులో పాలిటెక్నిక్ చేసి, ఎనభైలో మైకో కంపెనీలో ఫోర్మన్గా ఉద్యోగంలో చేరి, అప్పటికి
ఇంకో ఐదేళ్ళలో రిటైరవుతాడనగా డిప్యూటీ మ్యానేజర్ అయ్యాడు. ముగ్గురు పిల్లలు. పెద్దది
ఆడపిల్ల, ఎమ్బీబీయెస్ మూడో సంవత్సరం. రెండవవాడు సరే ఇంజనీరింగులో
సీటు వచ్చింది. ఇక మూడవవాడి గురించే అతడి బెంగ.
"ఏడ బుట్టిణ్డో ... అంతా మా ఆడోళ్ళ పోలిక. సిన్నప్పడ్నించీ సైన్సు మీన ద్యాస
ఉండ్లా. పీయూసీ సేస్తుణ్డాడు. కాలేజీకి పోయేద్లే, పగలూ ... రాత్రీ ... ఏవత్తు సూసిన్డా ఆ స్నూకర్ పార్లర్లోనో ఇల్లణ్టే ఇంటర్నెట్
కాఫేలోనో... ఏంసేసేటికీ అంతుబట్టట్లే..." అంటూ చాలాసేపు వాపోయిన మాట మాత్రం ఇంకా
గుర్తుంది.
ఆ తరువాత క్లబ్బులో చాలాసార్లు కనిపించినా, అతడి ధ్యాసలో
అతడు, నా పనిలో నేనూ, పెద్దగా మాట్లాడుకున్నది
లేదు.
---
కానీ... ఇవాళ ఏమయ్యిందో నన్ను చూడగానే ఉత్సాహంగా ఎదురొచ్చాడు. "ఏమప్పా? చాలా రోజులైనాది నీతో మాటాడి. ఏను బేకు? స్కాచ్?" అంటూ భుజంమీద చెయ్యివేసి బార్ వైపు కదిలాడు.
"షెట్టరే ... ఎరడు టీచర్స్" అంటూ బార్ స్టూల్ మీద బైఠాయించాడు.
"ఏంసార్, చాలా ఉత్సాహంగా ఉన్నారు? ఏమిటి విశేషం?"
"ఏముత్సాహంలేయప్పా... రిటైరయుండ్లా. ఇదే ఓన్లీ టైంపాసూ"
"ఓహో? ఎన్నాళ్ళయింది? మీ చిల్డ్రన్
ఇప్పుడు ఏంచేస్తున్నారో?"
"వోకె... ఇప్పుడే సిన్నోడు నన్నీడ దిగబెట్టి పోయిణ్డాడు. నైట్ డ్యూటీస్
... ఉదయాన్నే వస్తాడు. పగలెల్లా ఇంటికాడే ఉండినా, ఏందో పనులు, ఫోన్లు. నమ్మల్కి ఏనూ కల్సాయే ఇల్ల. ఈడ్నించి
పోయేటికి కూడా పర్మనెంటు ఆటో అరేంజి మాడిన్డాడు ... నో డ్రింక్ అండ్ డ్రైవు ... ఎల్లా
వాణి రూల్సు ప్రకారమే పోవాలె ... హెహెహె"
"మరి మీ డాటర్ ... ?"
"ఆహ్ ... ఆయమ్మా? పెళ్ళిసేసి పంపించిణ్డాం. ఈడనే, హోసూర్ ప్రక్కల్నే ఆళ్ళ అత్తోరూరు. అల్లుడాడ్నే ప్రాక్టీసు సేస్తుండు. ఏం ప్రాక్టీస్లేయప్పా
... ఆయమ్మ పీజీకి అయిణ్డ కర్చు తీరేటికి పాతికేళ్ళు పట్టుడ్ది. నా గ్రాట్యుటీలో సగం
దానికే బట్టిణ్డె. సిన్నోడు నాకాడ్ణే ఉండె ... అదికే స్వల్ప రిలీఫు..."
"సూరత్కల్లులో కదా ఇంజనీరింగ్ చేసాడు? ఇప్పుడే
కంపనీలో ఉన్నాడు?"
"అదా...? ఆడు గాదప్పా ... ఆడు పెద్దోడు. పోయినేడే ఎంటెక్
అయ్యిణ్డె. నాయప్ప కూతుర్కే ఇచ్చి జేసుండాం. మద్రాసులో ఏదో కంపనీలో సేస్తుండు. ఆడి
జీతం ఆడ్నే సరిపడ్లా. సిన్నోడు నాకాడ్ణ ఉండాడు గన్క సరిపోయె ..."
"అంటే ... మీ చిన్నకొడుకా? ఏమీ చదవకుండా
స్నూకరూ, ఇంటర్నెట్టని తిరిగే వాడన్నట్లు గుర్తు? ఏం చదివాడేంటి?"
"వాణికి ఈ సదువులెందుకప్పా? ఆడిది నా
పోలికె. ఆడే నూరుమందికి నేర్పుతుండాడు. కాగ్నిజెంట్ కంపనీలో అమెరికన్ లాంగ్వేజ్ ట్రైనర్.
రెండు లక్షలు జీతం. ఇణ్టి ఖర్చంతా ఆడే సూసుకుంటాణ్డు. ఆమైలే నాకు నెలకి క్లబ్బు ఖర్చులకి
ఇరవైవేలు ఇస్తాండు. అన్దుకేగదా స్కాచి తాగుతుండా ... హెహెహె... వన్ మోర్?"
---
తన దాకా వస్తే గాని తెలియదంటారు! బాగుంది.
ReplyDeleteచదువుకి, జీవితంలో పైకి రావటానికి సంబంధం లేదుగా మరి.
ReplyDelete