Search This Blog

Monday, December 5, 2011

వాశిష్ఠీదేవి పరిచయం

 
పవిత్ర గోదావరీ నదీతీరం. పడమటి కనుమల్లో నాసికా నగరివద్ద పుట్టి ఆంధ్రమహరాట్టులసీమలను సస్యశ్యామలంచేస్తూ తూర్పుకనుమలతో దోబూచులాడుతూ దక్షిణారామానికి దిగువగా ప్రాగ్సాగరంలో కలిసే మహానది. ఒక్క పవిత్రస్నానంతోనే సకల పాపాలూ హరించగల పుణ్యనది. అది ప్రతి పన్నెండేళ్ళకూ ఒకసారి వచ్చే మహా పర్వదినం. ఆనాడు ఆ నదీమతల్లి జలాల్లో మునకవేయని దౌర్భాగ్యుడు ఆ ప్రదేశంలోనే ఉండదు. నేలయీనినట్లు జనం. నదీతీరంలో అమ్మవారి కోవెల. ఆమె బ్రాహ్మణులకు బ్రహ్మాణి, వైదికులకు విద్యాదాయియైన సరస్వతి, ద్రావిడులకు ఇలాదేవి, మరియూ సామాన్య జానపదులకు బొడ్డెమ్మతల్లి. ఇక బౌద్ధధర్మాన్ని ఆచారించేవారికి బుద్ధిస్వరూపిణి ప్రజ్నాపారమిత. మహాత్వ కవిత్వ పటుత్వ సంపదలిచ్చే కల్పవల్లి. 
ఉచ్చైశ్రవాలవంటి పంచకల్యాణులపై సైనికులు దారిచూపగా, మణిమయ చత్ర చామరాలతో రాచభటులు ముందురాగా, భేరీ నాదస్వరాలకి అనువుగా వేశ్యారమణీ సమూహం నృత్యగీతాలు ఆలపించగా, రక్షకబృందం, పరివారం చుట్టూ నడవగా, రాజమాత గౌతమీదేవియొక్క రాచపల్లకీ దేవి ఆలయం ముందు వచ్చి నిలిచింది.
ఐరావతపు దంతములవన్నె వెలినూలు చీరె, కావిరంగు కాశ్మీరపు ఉన్ని పైబట్టతో ఆభరణరహితయై దైవమాత అదితీదేవిలా పల్లకిదిగిన రాజమాత గౌతమీదేవిని చూసిన మరుక్షణం జయధ్వానాలు మిన్నంటాయి.
శాతవాహన సామ్రాజ్య క్షేమదాయీ... జయః
శ్రీశాతకర్ణీ వరపుత్ర దాయిత హిరణ్యగర్భీ... జయః
ఆంధ్ర కర్ణాట జన కల్యాణకారిణీ... జయః
అపరిమిత ధన ధాన్య దాన ప్రదాయినీ... జయః
రాజమాత దర్శనార్థం విరగబడ్డ జనాన్ని అదుపుజేయడం ఒక మహాయజ్నమే!
అంతలో...
అదే పల్లకీనుండి,
మహాచీనంలో ప్రత్యేకించి నేయించిన నాజూకు నాచుపచ్చ హోంబట్టుపై, కాంచీపురపు బంగారు బుటాతో మామిడిపిందెల అంచు చీరె, చాటున దోబూచులాడే లేత కుచాగ్రాలను దాచే వ్యర్ధప్రయత్నం చేస్తున్న కుంకుమరంగు మహాలంక రవపట్టపు రవికె, దానిపై ఆరుపేర్ల సువర్ణ పణహారం, శంఖాన్ని పోలిన మెడచుట్టూ రవ్వల కంఠాభరణం, వసంతర్తాగమనం తెలియజేసే మొదటి మామిడి పిందెవంటి చుబుకంపై మూడు చుక్కల పచ్చబోట్టు, సంకర్షణుని హలాగ్రంలా కోటేరేసిన నాసాగ్రంపై మంచిముత్యపు నత్త్తు, బెత్తెడు జారిన జంట సంపెగలవంటి చెవులపై ఉయ్యాలలూగే కుండలాలు, మహాసాగరమువలె సమస్త భూమండలాన్నీ తమలోతుల్లో దాచగల కాటుకదిద్దిన కళ్ళు, భ్రూమధ్యంలో ఎర్రని దోసపిందె బొట్టు, విశాలమైన పాపిట పచ్చల రావిరేకు, తుమ్మెద రెక్కలను తలదన్నే కచసంపదను ముత్యాల సరాలతోనూ సన్నని కనకాంబరాలతోనూ పేనిన బారెడు జడ, ఎడమ భుజంపై పడగెత్తి నునువైన చామనఛాయ దండను చుట్టిన వాసుకీబంధపు వెండి వంకీ, ముంజేయి నుండి మోచేతి వరకూ తీర్చిన రత్నమయమైన కంకణాల బరువుకు వణికే పల్లవ కోమలములైన బాహువులు, అర్ధచంద్రమను బోలిన నాభిని తనలో దాచిన ఆకాశము వంటి నడుముకు వెండి గంటలు కూర్చిన కెంపుల వడ్డాణ్ణం, కస్తూరికాది పాదలేపనాలతో మిశ్రితమైన లత్తుకతో అరుణకాంతులు వెదజల్లే పాదద్వయం.... రత్న మంజూషపై అవి మోపినప్పుడు చేసిన మణికింకిణుల కణక్కణనాదాలకు నిశ్చేష్టులైన జనానికి, ఆ అసమాన సౌందర్యరాశి, ఆ అలౌకిక లావణ్యమణీ ఎవరో ఊహకందలేదు...
’ఈమె మానవ సుందరి కాదు దేవలోకంనుండి వచ్చిన ఇంద్రాణి కాబోలు!’
’లేక నాగలోకంనుండి వచ్చిన ఉలూచీ దేవియా?’
’లేదు, ఈ మచ్చెకంటి, సాగరగర్భాన ఉదయించిన లక్ష్మీదేవియే!’
’పీతవర్ణపు చీరెలో వసంతుని సహోదరి, కామునికై వచ్చిన రతీదేవేమో?’
ఇలా తమలోతమే ఊహించుకుంటూ చేష్టలుడిగిన జనానికి కంచుకి హెచ్చరికతో తెలివివచ్చింది.
’వినండహో..... విశాఖనాగడుదొర మగ, కళింగ రట్టోడి కూతు, సాతకన్ని మారాజు కాబోయే ఇల్లాలు, తెన్గుకన్నడ సీమకి దేవుళ్ళిచిన దొరసాని, సాతవానికుల మారాణి, సిరితాయి వాసిఠ్ఠీయమ్మ మారాజుని మనువాడ పైథానపూరి దారి మనసీమకొచ్చె. బిరాన మొక్కుడీ’ అన్నంతనే జనంలో కలిగిన కలకలం అతింత కాదు.

No comments:

Post a Comment