Search This Blog

Monday, April 18, 2011

రాయచూరు


అది రాయచూరు. చాలా మందికి తెలుసు అది కర్ణాటకలో ఒక జిల్లాకేంద్రమని. రైల్లో వెళితే  క్రిష్ణమ్మ ఒడ్డున థెర్మల్ విద్యుత్గారం ఆ ఊరికి కొండగుర్తు.
ఆ ఊరికి అదే పెద్ద హోటలు.  మద్యపాన ప్రియులకి మంచి వసతైనది. మరి దాని ఓనరు ఆ జిల్లాకి పెద్ద అబ్కారి డీలరూ, ఏదో మనకీ కొంచెం ఫ్రెండూ, సరా?

కారు పార్కింగుకి   కాస్త దూరంగా కోట గోడ.  సాయంకాలం, అంతగా పనేమీ లేదు. మాములేగదా! అలా సిగరెట్టు నోట పట్టి చల్లగాలికి బయటకి అడుగెట్టాను. వంతెన మీదుగా కోట ద్వారం దాటి కొంచెము ముందుకెళ్ళానో  లేదో అలవాటు ప్రకారం దాదాపుగా ఒక శతాబ్దం వెనక్కి వెళ్ళింది, మనస్సు. రాజమండ్రిలో ఒకానొకప్పుడు ఒక కుర్ర లాయరు ప్రాక్టీసు ప్రారంభించాడు. మా తాతయ్యకి మద్రాసు లా కాలేజీలో పరిచయమట.
చిన్నప్పుడెప్పుడో చెప్పినట్లు గుర్తు. బహుశా ౧౯౩౦ వ సంవత్సరమేమో. పెద్ద తేడా లేదు. ఆయన కూడా ఇదే వంతెన మీదుగా అగడ్తను దాటి నాలాగే ఇదే దారిన నడిచాడనుకుంటాను. 
కానీ రెండు విషయాల్లో ఆయనకీ నాకు తేడా వుంది.
ఒకటి ఆయన కాల్చిన సిగరెట్టు, అది సిస్సర్సు. తరవాత అదేదో పుస్తకంలో ఆయనే చెప్పారు. 'నారాయణరావు'  అనుకుంటా.
రెండవది. ఆనాడు ఆయన వేసిన ప్రతి అడుగూ ఒక వాక్యమై తెలుగు వాళ్ళు గర్వించదగ్గ  ఒక నవల అయ్యింది. 
ఆయన పేరు శ్రీ అడివి బాపిరాజు. ఆయన ఆరోజు చూసిన శిలా శాసనం ఇప్పటికీ అలాగే ఉంది. 

శ్రీ కాకతీయ కటక సన్నాహ  
శ్రీ రుద్రదేవ దక్షిణభుజదండ  
కడుపులూరి పురవరాధీస్వర 
 కోసగి మైలి తలగొండుగండ 
 ఉప్పల సోము తలగొండుగండ 
 మనుమకుల మార్తాండ 
 రాపాక భీమ నిర్ధూమధామ
 కందూరి కేశినాయకు తలగొండుగండ
వందిభూపాల తలగొండుగండ
అక్కినాయకుతలగొండుగండ 
మేడిపల్లి కాచాయ ఉరిశిరకుండ 
తెర్రాల కాటయ దిశాటపట్ట
ఏరువతొండ గోధూమఘట్టన ఘరట్ట
బేడచెలుకినాయని నిస్సాణాపహారణ
చోడోదయపట్టసూత్రతురంగాపహరణ
కోట పేర్మడిరాయని కంటాభరణదూరకార
వర్ధమానపురవరేశ్వర
శ్రీ శ్రీ శ్రీ గోన గన్నయా రెడ్డి మహామండలేశ్వర







2 comments:

  1. గోన గన్న రెడ్డి గారి కథను జూనియర్ NTR ని పెట్టి సినిమా తీస్తున్నారటగా?

    ReplyDelete
  2. అడివి బాపిరాజు (1895 - 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచే వారు.
    బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుని ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు. బాపిరాజుకు చిన్ననాటినుండీ కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాధ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
    సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.

    ReplyDelete